మొక్కుల పేరుతో విజయవాడ రావడం, ఇంద్రకీలాద్రిలోని అమ్మవారి ఆలయానికి వెళ్లడం, దర్శనం చేసుకుని బయటకి వచ్చాక కాసేపటికే… అక్కడి నుంచే రాజకీయాలు చేయడం… ఈ మధ్య ఈ సంస్కృతి పెరిగిపోతూ ఉండటంతో విజయవాడ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ కొండపై రాజకీయ ప్రకటనల మీద ఆంక్షలు విధించింది. ఆలయం చుట్టుపక్కల రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆలయ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అంతేకాదు, ఆలయానికి రాబోతున్న రాజకీయ ప్రముఖులకు సంబంధించి టూర్ షెడ్యూల్ ని కూడా మీడియాకి ఇవ్వకూడదని నిర్ణయించారు. గుడి మెయిన్ గేట్ వద్ద ఫ్లెక్సీలూ, పోస్టర్లూ, బ్యానర్లు… ఇలాంటి హడావుడి ఏదీ ఇకపై ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వచ్చి, ఆలయ సమీపంలోనే మీడియాతో రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. కాబట్టి, రాజకీయ ఉపన్యాసాలకు ఆలయ ప్రాంగణం వేదికగా ఉండకూడదనే ఉద్దేశంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఆలయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇతర రాజకీయ ఎలా స్పందిస్తాయో చూడాలి. దీన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు కాబట్టే, ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఆంక్షలు పెట్టారంటూ కామెంట్స్ వినిపించే అవకాశం ఉంది. ఆలయ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని… రాజకీయాలకు వేదిక కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఆలయ అధికారులు తీసుకున్నా… దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితులే అక్కడున్నాయి! రాజకీయాలను పక్కన పెట్టేసి చూస్తే… ఇది కచ్చితంగా మంచి నిర్ణయమే. ఆలయానికి వచ్చే సాధారణ భక్తులకు కూడా ఈ నిర్ణయం వల్ల మేలే జరుగుతుంది.