ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్… మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డికి మరోసారి షాక్ తగిలే సూచనలే కనిపిస్తున్నాయి. ఆయన పదవిని రెన్యూవల్ చేయడానికి జగన్ సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం.. ఇప్పుడు ఆయన పదవికాలం పూర్తయి రెండురోజులు అయింది. పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వం తటపటాయిస్తోంది. ఈ కారణంగా ప్రస్తుతం టీటీడీకి బోర్డు లేకుండా పోయింది. చైర్మన్ కూడా మాజీ అయిపోయారు. పాలక మండలిసభ్యులు కూడా మాజీ అయిపోయారు. శేఖర్ రెడ్డి సహా ఎవరూ ఇప్పుడుపాలక మండలి సభ్యులు కాదు. అందుకే వారు జారీ చేస్తున్న సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు ఆమోదించడం లేదు. పక్కన పడేస్తున్నారు.
అయితే సుబ్బారెడ్డి స్వయంగా సీఎం బాబాయ్ కావడంతో ఆయనకు మాత్రం అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారికంగా పదవి లేకపోయినా యధావిధిగా కార్యకలాపాల్లో పాల్గొనేలా అనుమతిస్తున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు మరోసారి పదవి పొడిగింపు లభిస్తుందని టీటీడీ వర్గాలందరికీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.నిజంగా ముఖ్యమంత్రికి అలాంటి ఆలోచన ఉంటే.. పొడిగింపు ఉత్తర్వులు పదవీ కాలం ముగింపునకు ముందే ఇచ్చి ఉండేవారని అంటున్నారు. టీటీడీ బోర్డు పదవి కాలాన్ని ప్రతీ సారి ఏడాదికి మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ సీఎం జగన్ జంబో బోర్డును ఏర్పాటు చేసి.. రెండేళ్ల పదవీ కాలం ఇచ్చారు. అది కూడా పూర్తయింది.
సుబ్బారెడ్డి గతంలో ఎంపీగా ఉండేవారు. మాగుంటను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో … న్యాయం చేయడానికని టీటీడీ బోర్డు పదవి ఇచ్చారు.ఇప్పుడు అది కూడా పూర్తయిపోవడం… ఆ పదవిని కూడా ఇతరులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతూండటంతో సుబ్బారెడ్డి అసంతృప్తికి గురవుతున్నారని అంటున్నారు. ఆయనకు సర్ది చెప్పడానికే ఆలస్యం అవుతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలు.. కుల రాజకీయాల కారణంగా.. ఈ సారి క్షత్రియులకు టీటీడీ బోర్డు పదవిని ఇస్తారని ఇప్పటికే ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది.