కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీల్లో ఒకటి దక్కించుకుని మండలి చైర్మన్ అయిపోదామని అనుకుంటున్న వీహెచ్.. ఇందు కోసం హైకమాండ్ పై ఒత్తిడి పెంచుదామని చేసిన ప్రయత్నం వికటించింది. ఆయన తన ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం నిర్వహించారు. అది తమ పార్టీకి సంబంధించిన వారు కాదు.. అన్ని పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. వచ్చిన వారు సైలెంటుగా ఉండలేదు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉండి.. కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై.. నిందలు మోపేందుకు ఇలా ప్రత్యేకంగా కుల సమావేశం పెట్టడం కాంగ్రెస్ హైకమాండ్ ను ఆగ్రహానికి గురి చేసింది. గతంలో అయితే పట్టించుకునేవారు కాదేమో కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా వెంటనే రియాక్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. వీహెచ్ వ్యవహారంపై వెంటనే స్పందన రావడమే దీనికి సాక్ష్యం.
వీహెచ్ ఏదో ఓ పదవి కోసం తహతహలాడిపోతున్నారు. చాలా కాలంగా ఆయనకు ఎలాంటి పదవులు లేవు. ఎన్నికల్లో గెలవలేదు. ప్రభుత్వం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇచ్చి శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చినా సర్దుకుపోతానని ఆయన సంకేతాలు పంపుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ షెడ్యూల్ రావడంతో తన కుల బలం చూపించుకునేందుకు అన్ని పార్టీల నేతల్ని ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడే తేడా కొట్టింది. ఇప్పుడు వీహెచ్ కు ఎలాంటి అవకాశాలు లేనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.