తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయిపోయినట్లేనా? ఇక ఆ పార్టీ దుకాన్ బంద్ అయినట్లేనా? అనే అనుమానాలు రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో కనీసం మిగిలిన ఉన్న నాయకులు, కార్యకర్తల్లో నమ్మకం కలిగించడానికి చంద్రబాబునాయుడు స్వయంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలు దారుణంగా దెబ్బతిని ప్రజల ఆదరణతో మళ్లీ ఎదిగి అధికారంలోకి వచ్చిన చరిత్రలోని అనేక దృష్టాంతాలను ఆయన ఉదాహరించి.. తెలంగాణలో కూడా తెలుగుదేశం మళ్లీ కోలుకుంటుందని.. అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు స్వయంగా నడుంబిగించడం విశేషం. సంక్షోభాలను ఎదుర్కొనే సత్తా తెలుగుదేశానికి మాత్రమే ఉందంటూ కార్యకర్తలను నమ్మించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అలాగే సెటిలర్ల మీద చంద్రబాబు ప్రధానంగా దృష్టిపెట్టడం విశేషం. 2014లో హైదరాబాదులో సెటిలర్లు ప్రధానంగా ఉన్న సీట్లన్నీ తమ పార్టీనే గెలిచిందని, 2019లో కూడా ఇదే రిపీట్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతిన్నదని, కానీ పదేళ్లలో మళ్లీ అధికారంలోకి వచ్చాం అన్నారు. ఒకప్పట్లో పార్లమెంటులో రెండుస్థానాలు మాత్రమే కలిగిఉన్న భాజపా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో అందరికీ తెలుసునని చంద్రబాబు చెప్పారు. అదేమాదిరిగా తెలంగాణలో కూడా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెరాసకు తెదేపా మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేనని, ఇకమీదట ఇక్కడి పార్టీ వ్యవహారాలకు మరింత సమయం కేటాయించి.. పార్టీని కాపాడుకోవడంపై దృష్టిపెడతానని చంద్రబాబు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బతిన్నా, పార్టీని బలోపేతం చేసి తీరుతాం అని ఆయన వెల్లడించడం విశేషం. ఒకరిద్దరు నాయకులు పోయినంత మాత్రాన పార్టీ ఎక్కడికీ పోదు అని ఆయన అందరికీ నమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం విశేషం.