‘సభ ఆర్డర్ లో లేదు’.. గడచిన ఐదు రోజులుగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నోట వింటున్న మాట ఇదే. కేంద్రంపై ఆంధ్రా ఎంపీలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు భాజపా సిద్ధంగా లేదు. సభలోకి తీర్మానాన్ని రానీయడం లేదు. తెరాస, అన్నాడీఎంకే ఎంపీలు అదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అవిశ్వాసం చర్చకు వచ్చేవరకూ ప్రశాంతంగా కూర్చోండయ్యా బాబూ అంటే.. ‘అబ్బే, మా కేసీఆర్ తో చంద్రబాబు మాట్లాడలేదు, మా ఓపీయస్ తోగానీ ఈపీయస్ తోగానీ చంద్రబాబు చెప్పలేదు’ అంటున్నారు. తమ అధినేతలు ఆదేశిస్తేనే సభలో ఆందోళనలు విరమిస్తారట..! అంతవరకూ ప్లకార్డుల ప్రదర్శన కొనసాగుతూనే ఉంటుందట. అయినా, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని పార్లమెంటరీ పార్టీ నేతలను ముందుగానే టీడీపీ కోరింది కదా! అది చాలదా, ఆయా పార్టీల అధినేతలకు బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టు చెప్పాలంటే ఎలా..?
సభ ఆర్ఢర్ లో లేకపోవుట.. అనే డ్రామాను ప్రతీరోజూ చూస్తున్న సగటు ఆంధ్రుడికి గుర్తొస్తున్నది ఏంటో తెలుసా.. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు, విభజన బిల్లును నాడు పార్లమెంటులో ఆమోదించిన దృశ్యాలు..! నాడు సభ తలుపులు వేసేశారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం కలిగించారు. సభలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియకుండా చేశారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య విభజన బిల్లును ఆమోదించారు. అప్పుడు సభ ఆర్డర్ లో ఉందా లేదా అనే చర్చ రాలేదే..! సభ్యులు గందరగోళం చేస్తున్నారన్న అభ్యంతరాలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదే..! అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు భాజపా అధికారంలో ఉంది, అంతే తేడా. అంతవరకూ ఎందుకు… తాజా సమావేశాల్లోనే, ఇదే గందరగోళ పరిస్థితుల మధ్యనే కదా పలు బిల్లులను ఆమోదింపజేసుకున్నారు. తూతూ మంత్రంగా బడ్జెట్ ను కూడా తోసేశారు. అప్పుడు కూడా సభ ఆర్డర్ లో లేదే..!
ఇక, స్పీకర్ స్థానంలో ఉన్న సుమిత్రా మహాజన్ చెబుతున్న సాకు ఏంటంటే.. అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న సభ్యులు ఎంతమంది అనేది తాను లెక్కించలేకపోతున్నాననీ, ప్లకార్డులు అడ్డంగా ఉండటంతో తనకు ఎవ్వరూ కనిపించడం లేదంటున్నారు. సభ్యులను లెక్కించాలనుకుంటే… కాస్త ఓపిక చేసుకుని కుర్చీలోంచి లేచి, కాసేపు నిలబడితే చాలు కదా! ప్లకార్డులు పైనుంచి సభ అంతా స్పష్టంగా కనిపిస్తుంది కదా అనే అనుమానం రోజూ టీవీలు చూస్తున్నవారికి సహజంగానే కలుగుతుంది. అంతెందుకు, అడ్డుపడుతున్న అన్నాడీఎంకే, తెరాస సభ్యులను తన ఛాంబర్ కి పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఆ పనీ చేయడం లేదు. లోక్ సభకు బాధ్యత వహించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాబ్ అయితే.. ఇదేదో తన పరిధిలోకి రాని అంశం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సభ ఆర్డర్ లో లేకపోవడం అనేది తమకు సంబంధం లేని అంశంగా చోద్యం చూస్తున్నారు. అదేంటో.. ఆంధ్రాను విభజిస్తున్నప్పుడు ఎంత గందరగోళంగా సభ ఉన్నా ఆర్డర్ లో ఉన్నట్టే బిల్ పాస్ చేశారు. ఇప్పుడు, ఆ విభజన కారణంగా ఆంధ్రాలో తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సభ ఆర్డర్ లో ఉండటం లేదంటున్నారు..!