నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ… ఈ సినిమాల్లో వెంకటేష్ డైలాగ్ డెలివరీ, వేసిన పంచ్‌లను ఎప్పటికీ మర్చిపోలేం. త్రివిక్రమ్ మాటలకు, వెంకీ స్టైల్ తోడై – ఆ సినిమాలు అలా నిలిచిపోయాయి. త్రివిక్రమ్ దర్శకుడయ్యాక.. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని అందరూ ఆశించారు. `అజ్ఞాతవాసి`లో ఓ చిన్న పాత్రలో కనిపించి – ఆ లోటు కాస్త తీర్చే ప్రయత్నం చేశాడు వెంకీ. కాకపోతే.. ఆ సీన్‌ని విడుదల రోజున థియేటర్లో లేకుండా చేసి నిరుత్సాహపరిచింది చిత్రబృందం. ఆ తరవాత కలిపినా.. పెద్దగా హైప్ రాలేదు.
అయితే వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని హారిక హాసిని సంస్థ ప్రకటించింది. దాంతో నిరీక్షణ ఫలించినట్టు అనిపించింది. `అరవింద సమేత`కి ముందే ఈ కాంబోలో సినిమా ఉంటుందని ఆశించారు. కానీ కుదర్లేదు. `అరవింద సమేత` తరవాతైనా ఉంటుందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు బన్నీకి కమిట్ అయిపోయాడు త్రివిక్రమ్. దాంతో వెంకీ – త్రివిక్రమ్ కాంబో కేవలం ప్రకటనలకే పరిమితమా? అనే అనుమానాలు మొదలైపోయాయి. బన్నీ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. పవన్‌తో `కోబలి` కూడా చర్చల్లో ఉంది. ఇలా వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. వెంకీ వైపు చూస్తాడా అన్నది అనుమానమే. ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా `ఈ కాంబో ఇక లేనట్టే.. అంటూ తేల్చేస్తున్నారు.