ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 25 లోక్‌సభ సీట్లలో 22 వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు.. కావాల్సిన సాయం… చాలా ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనా.. ఒక్కటంటే.. ఒక్కదానిపైనా వైసీపీ ఎంపీలు ఇంత వరకూ గళమెత్తే ప్రయత్నం చేయలేదు. ఒక్కదానిపై మాట్లాడిన రఘురామకృష్ణంరాజుకు.. అమరావతి పిలిచి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడితే.. ఏం వస్తుందోనన్న ఉద్దేశంతో.. వైసీపీ ఎంపీలు సైలెంటవుతున్నారు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి ఏం మాట్లాడమని చెబితే.. అదే మాట్లాడతామంటున్నారు.
22 మంది ఎంపీలు నోటికి ప్లాస్టరేసుకున్నారా..?
ఫలానా అంశంపై మాట్లాడాలని చెప్పడానికి విజయసాయిరెడ్డికి, మిధున్ రెడ్డికి.. కూడా.. వెసులుబాటు లేకుండా పోయింది. ప్రత్యేకహోదా కోసం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినట్లుగా.. గాంధీ విగ్రహాల దగ్గర నిరసన దీక్షలు.. పార్లమెంట్లో ప్రస్తావనలు.. వాకౌట్లు.. అనే ఆలోచనలు కూడా ఇప్పుడు చేయడం లేదు. అసలు ఆ మాటే ఎత్తవద్దని ఆదేశాలున్నట్లుగా వైసీపీ ఎంపీలు నోటికి ప్లాస్టరేసుకున్నారు. పోనీ.. ఏపీకి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు.. ఇతర అంశాలపైనైనా.. కేంద్రాన్ని నిలదీస్తారంటే.. ఆ మాటే లేదు. కనీసం నోటీసులు ఇచ్చి … ప్రశ్నలు అడిగే ప్రయత్నం కూడా చేయడం లేదు. అడిగే ప్రశ్నలన్నీ ఏపీకి సంబంధం లేనివే ఉంటున్నాయి. బల్లి దుర్గా ప్రసాదరావు అనే ఎంపీ.. అయితే.. గంగా ప్రక్షాళన గురించి అడిగారు.
ముగ్గురు ఎంపీలు ఉన్నా .. ఫలితాలు రాబడుతున్న టీడీపీ..!
మరో వైపు ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు.. వారికి ఓ ఎజెండా నిర్దేశించి పంపారు. తెలుగు భాషను కాపాడుకోవడం.. అమరావతి విషయంలో.. గట్టిగా పోరాడాలని చెప్పి పంపించారు. తెలుగు భాష విషయంలో.. మొదటగా కేశినేని నాని తొలి రోజే ప్రశ్నను సంధించారు. మాతృభాష ప్రాముఖ్యాన్ని కేంద్రం చెప్పేలా చేశారు. ఈ విషయంపై చర్చ ప్రారంభమయ్యేలా చేశారు. గల్లా జయదేవ్ అమరావతి విషయాన్ని పకడ్బందీగా ప్రస్తావించారు. మ్యాప్‌లో లేకపోవడం వల్ల..శంకుస్థాపన చేసిన మోడీని అవమానించినట్లేనని.. పార్లమెంట్లో ప్రస్తావించారు. దీంతో.. కేంద్రం.. రెండు రోజుల్లోనే అమరావతిని గుర్తిస్తూ.. కొత్త మ్యాప్ విడుదల చేసింది.
వైసీపీ ఎంపీలు గళమెత్తకపోతే ఏపీకి తీవ్ర నష్టమే..!
వైసీపీ ఎంపీలు.. రాష్ట్ర సమస్యలపై ఎందుకు నోరు మెదపలేకపోతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వడంలేదో చాలా మందికి పజిల్ గానే ఉంది. కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న ఉద్దేశంతోనే వైసీపీ పెద్దలు.. వీలైనంత సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఓట్లేసి పార్లమెంట్‌కు పంపిన ఎంపీలు నిష్ప్రయోజనంగా మారుతున్నారు. ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.