ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడల్లా మున్సిపల్, స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనట్లుగా కనబడుతోందన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. దాదాపుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ… ప్రభుత్వం మాత్రం.. వాటి గురించి ఆలోచన చేయడం లేదు. ఇప్పుడల్లా ఉండవని… మంత్రులతో మాత్రం ప్రకటనలు చేయిస్తున్నాయి. ఏ అధికార పార్టీ అయినా గెలుపు జోష్లో ఉన్నప్పుడే.. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి.. స్వీప్ చేయాలని అనుకుంటుంది. కానీ వైసీసీ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి.
2014లో … అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే… స్థానిక, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా.. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వచ్చేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ మున్సిపల్ ఫలితాల్లో.. టీడీపీ ఏకపక్ష విజయాలు నమోదు చేయడంతో… వైసీపీ వెంటనే అప్రమత్తమై… ఫలితాలు.. అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయిస్తాయని.. కోర్టులో పిటిషన్ వేసి.. స్థానిక ఎన్నికల కౌంటింగ్ ను నిలిపివేయించింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. అక్కడా టీడీపీకే మెజార్టీ ఫలితాలు వచ్చాయి. ఐదేళ్లు ముగిసిపోవడంతో… ఇప్పుడు పంచాయతీ, పరిషత్, మున్సిపల్ స్థాయిలో.. ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. గతంలో అధికారులు.. అసెంబ్లీ ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే… అన్ని రకాల ఎన్నికలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసేశారు. ఓటర్ల జాబితాల నుంచి రిజర్వేషన్ల వరకూ అన్నీ రెడీ చేశారు. కానీ… కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాత్రం ఆలోచిస్తోంది.
కొత్త ప్రభుత్వం అదీ కూడా.. 151 సీట్లతో.. వైసీపీ విజయఢంకా మోగించింది. ఈ లెక్క ప్రకారం చూస్తే… ఏపీలో స్థానిక సంస్థలను కూడా స్వీప్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే… వ్యతిరేకత అప్పుడే పెరిగిపోయిందన్న భావన వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికే.. సీఎం జగన్మోహన్ రెడ్డి… ఎన్నికలను వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు. పథకాల లబ్దిదారుల చేతికి నగదు అందిన తర్వాత ఎన్నికలు పెట్టాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్లో రైతు భరోసా, జనవరిలో అమ్మఒడి చెక్కులు అందిస్తారు. అలాంటి సమయంలో… పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అంటే.. మరో ఆరేడు నెలలు.. స్థానిక సంస్థలన్నీ స్పెషలాఫీసర్ల పాలనలోనే ఉంటాయన్నమాట.