హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు హడావుడి ప్రారంభించారు. అయితే తర్వాతి రోజే మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అంత వరకూ బాగానే ఉన్నా.. తెలంగాణ తరహాలోనే తాము కూడా భారీ బహిరంగ సభ పెట్టాలన్న ఆలోచనకు ఏపీ బీజేపీ నేతలు రాలేకపోయారు.
కొద్ది రోజుల కిందట సభ ఉంటుందని చెప్పుకున్నారు కానీ.. తర్వాత అలాంటి సూచనలేం రాలేదు. ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు సభకు జన సమీకరణ పేరుతో నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏపీ నేతలు అదేమీ పట్టించుకోకపోతూండటంతో సభ విషయం చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. విశాఖలో భారీ సభ నిర్వహిస్తే ఎన్నికలకు ముందు సన్నాహకంగా ఉంటుందని అనుకున్నారు. అయితే అల్లూరి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడేది మాత్రమే హైలెట్ చేసుకునే అవకాశం ఉంది.
బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఏపీ విషయంలో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తెలంగాణలో పాగా వేస్తామన్న నమ్మకానికి వస్తున్నారు కానీ ఏపీలో మాత్రం కనీస బలం నిరూపించుకుంటామన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు. దానికి తగ్గట్లుగానే ఏపీ బీజేపీ నేతలు పై పై షోలతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే బీజేపీకి ఏపీ విషయంలో జాతీయ రాజకీయాల ఇంట్రెస్ట్ మాత్రమే ఉందని అందుకే ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెబుతున్నారు.. పొత్తులో ఉన్న జనసేన భవిష్యత్‌నూ వారు పెద్దగా పట్టించుకోకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.