ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు ముందు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివాదాస్పద ప్రకటన చేశారు. ఇరవై మూడో తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి జగన్ తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఆయన డిక్లరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తిరుమలకు వచ్చే అన్యమతస్థులు.. తమకు శ్రీవారిపై సంపూర్ణ నమ్మకం ఉందని… డిక్లరేషన్ సమర్పించి దర్శనం చేసుకోవాలి. ఇది చాలా కాలంగా ఉన్న నిబంధన. కేంద్ర ప్రభుత్వాన్ని కనుసైగలతో శాసిస్తున్న సమయంలో.. తిరుమల కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా.. ఈ నిబంధన గురించి తెలుసుకుని తనకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారు.
రూఢిగా అన్యమతస్తులు అని తెలిసిన వారి దగ్గర నుంచి ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. స్వచ్చమైన మనసుతో.. శ్రీవారిని కొలవడానికి ఇతర మతస్తులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వడానికి వెనుకాడరు. అయితే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎన్ని సార్లు వివాదాలున్నా… డిక్లరేషన్ మాత్రం ఇవ్వడం లేదు. జగన్ ఫ్యామిలీ క్రైస్తవాన్ని పాటిస్తారు. వారి ఇంట్లో మత బోధకులున్నారు. వారి కుటుంబ ప్రతి కార్యక్రమం క్రైస్తవ పద్దతిలోనే సాగుతుంది. హిందూ విశ్వాసాలపై వారు ఎలాంటి నమ్మకాలు పెట్టుకోరు. అందులో ఎలాంటి దాపరికం లేదు. అందుకే… ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆయన డిక్లరేషన్‌పై సంతకం పెట్టనప్పుడు వివాదం రేగింది. చెప్పులు వేసుకుని ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారనే దుమారం కూడా రేగింది.
అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సంప్రదాయాల్ని పాటించాల్సిన పరిస్థితి ఉంది. కానీ… గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ సారి కూడా ఆయన ఎలాంటి డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకే.. ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఎందుకైనా మంచిదని టీటీడీ చైర్మన్ హోదాలో… డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించారు. మరి ఇంతకు ముందు ఉన్న నిబంధనలు తొలగించారో లేక.. జగన్ కోసం ఈ మినహాయింపు ఇచ్చారో మాత్రం ఆయన చెప్పలేదు. అధికారిక నిర్ణయం తీసుకోకుండా… వైవీ సుబ్బారెడ్డి అలా ప్రకటించినా… జగన్ తిరుమల వెళ్లిన ప్రతీ సారి డిక్లరేషన్‌పై చర్చ జరుగుతూనే ఉంటుంది.