ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ విభజన చట్టానికి సవరణ చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు పెట్టిన ప్రైవేట్ బిల్లుపై పార్లమెంటులో శుక్రవారం ఓటింగ్ జరుగబోతోంది. దానికి వైకాపా కూడా మద్దతు ఇస్తోంది. ఇటువంటి సమయంలో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దాని గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలోనే పార్లమెంటులో ఏకగ్రీవంగా నిర్ణయించారు కనుక మళ్ళీ ఇప్పుడు దాని కోసం ప్రైవేట్ బిల్లు పెట్టవలసిన అవసరం లేదు. తెదేపా, భాజపాలకి చిత్తశుద్ధి ఉంటే ఎపుడో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. దాని కోసం నేడు మళ్ళీ ఈవిధంగా ప్రైవేట్ బిల్లు పెట్టవలసిన అవసరమే ఉండేది కాదు. మా పార్టీ హోదా కోసం జరిగే ఎటువంటి ప్రయత్నానికైనా పూర్తి మద్దతు ఇస్తుంది,” అని అన్నారు.
పార్లమెంటులో ఆమోదించిన హోదా కోసం మళ్ళీ బిల్లు పెట్టవలసి రావడం దురదృష్టకరమే. బొత్స చెప్పినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ విషయంలో చిత్తశుద్ధి లేకపోవడం వలననే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పక తప్పదు. నేటికీ వాటి తీరులో మార్పేమీ కనబడటం లేదు. పైగా ఆ ప్రైవేట్ బిల్లుని ఒక అవకాశంగా భావించే బదులు దానిని ఒక గండంగా భావిస్తూ ఏవిధంగా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. ఈ రోజు అజెండాలో ఆ బిల్లుని చిట్టచివరి అంశంగా చేర్చడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతోంది. ఈసారి కూడా తెదేపా, భాజపాలు పార్లమెంటులో ఏదో విధంగా తప్పించుకోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో ప్రజల నుంచి తప్పించుకోగలవా? వారికి సమాధానం చెప్పుకోగలవా? అని ఆలోచిస్తే మంచిది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని, ప్రజల అభిలాషని గుర్తించకుండా విర్రవీగినందుకు దేశప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏవిధంగా బుద్ధి చెప్పారో అందరూ చూశారు. ఆ విషయాన్నీ అన్ని రాజకీయ పార్టీలు సదా గుర్తుంచుకోవడం చాలా మంచిది లేకుంటే చివరికి అవే నష్టపోతాయి.