ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి! రాష్ట్ర విభజన పాపమంతా టోకున కాంగ్రెస్ నెత్తిమీద పడటంలో పార్టీ భూస్థాపితమైంది. అయితే, ఇప్పటికీ కోలుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఇంకా చెప్పాలంటే.. కోలుకోవాలన్న చిత్తశుద్ధితో పార్టీ ప్రయత్నించడం లేదని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మూలాలు బాగానే ఉన్నాయి. కానీ, నడిపించే నాయకుడు లేకపోవడంతో పరిస్థితి రానురానూ అధ్వాన్నంగా మారుతోంది. అయితే, వచ్చే ఎన్నికల్ని దృష్టి పెట్టుకుని కొన్ని మార్పులూ చేర్పులూ ఉంటాయంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డిని మార్చే ఆలోచనలో ఉన్నారనీ, యువతకు అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమౌతోందనే కథనాలు వినిపించాయి. ఇదే అంశమై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు.
రఘువీరా రెడ్డి బాగానే పనిచేస్తున్నారంటూ తాజాగా ఆయన కితాబిచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఆలోచన లేదనీ, రఘువీరా పనితీరు బాగుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. చంద్రబాబు, జగన్ ఒకే తానులో ముక్కులు అన్నారు. జగన్ ఆర్థిక నేరాల్లో చిక్కుకున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కారు ఫెయిల్ అవుతోందనీ, తనయుడు నారా లోకేష్ ను దొడ్డిదారిన మంత్రిని చేశారంటూ ఆరోపించారు.
సో.. డిగ్గీరాజా చెబుతున్నది ఏంటంటే.. ఆంధ్రాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫెయిల్ అవుతున్నాయని! మరి, కాంగ్రెస్ ప్రొగ్రెస్ ఏంటనేది కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టు కదా! ఇంతకీ ఆంధ్రాలో కాంగ్రెస్ ఏం చేస్తున్నట్టు..? రఘువీరా బాగానే పనిచేస్తున్నారంటే… ఏ అంశంలో అనేది కూడా చెప్పాలి కదా! నిజానికి, గడచిన ఎన్నికల తరువాత నుంచీ నేటి వరకూ ప్రజల తరఫున పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమౌతూనే ఉంది. రాజధాని భూసేకరణ విషయంలోగానీ, రైతుల సమస్యలపైనాగానీ, యువత ఉపాధి అంశంలోగానీ, మహిళా సమస్యలపైగానీ.. ఇలా ఏ ఒక్క అంశంపైన అయినా కాంగ్రెస్ వాయిస్ బలంగా వినిపించిన సందర్భం ఉందా..?
పోనీ, గతం ఎందుకూ.. ప్రస్తుతం తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమౌతోంది. ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా ఆ విషయమై చురుగ్గా స్పందించడంలో విఫలమౌతోంది. మరి, ప్రజల పక్షాన ఉన్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ స్పందన ఏదీ..? పనితీరు బాగుందని ప్రశంసంలు అందుకుంటున్న రఘువీరా ఈ అంశమై ఎక్కడ స్పందించారు..? నిజం చెప్పాలంటే.. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రోగ్రెస్ లేకుండా పోయింది. ఆంధ్రాలో కాంగ్రెస్ పై ప్రజల్లో భరోసా పెరగాలంటే.. ముందుగా ప్రజా సమస్యలపై ఉద్యమించాలి. ప్రతిపక్షం విఫమౌతున్న చోట ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. డిగ్గీరాజా చేయాల్సిన విశ్లేషణ ఇదీ..! చిరంజీవి లాంటి నాయకుడిని పార్టీలో ఉంచుకుని కూడా ప్రజా సమస్యలపై మాట్లాడించలేకపోయిన నిస్సహాయత ఏపీ కాంగ్రెస్ ది. ఇవన్నీ వదిలేసి రఘువీరా పనితీరు బాగుందంటే.. ఎవరు హర్షిస్తారు చెప్పండీ..?