తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన వారికి పద్మ అవార్డులు ఇవ్వలేదని ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఓ చర్చ ప్రారంభించారు. మందకృష్ణకు సిఫారసు చేయకపోయినా ఇచ్చారని అందులో తప్పేం లేదన్నారు. కానీ తాము సిఫారసు చేసిన వారికి ఇవ్వాలి కదా అని వాదన. అయితే డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం సిఫారసు చేసినందునే ఇచ్చారు కదా అని కొంత మంది వాదిస్తున్నారు. నిజానికి పద్మ అవార్డులు సిఫారసుల ద్వారా ఇవ్వరు. సిఫారసు చేసిన వారికే ఇవ్వాలని లేదు. పద్మ అవార్డు ఎంపిక ప్రక్రియ పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది.
పద్మఅవార్డుల కోసం కేంద్రం నామినేషన్లను ఆహ్వానిస్తుంది.తమకు అవార్డు కావాలని ఎవరికి వారు నామినేషన్ పంపుకోవచ్చు. గొప్ప వ్యక్తుల కోసం ఇతరులు కూడా నామినేషన్ పంపవచ్చు. ఆన్ లైన్ లోనే ఈ నామిషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ల పరిశీలనకు ఓ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అన్ని నామిషన్లను పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో సిఫారసు చేస్తుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ప్రకటిస్తారు.
ఫలానా వారికి ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేశాయని ఆ కమిటీ పరిగణనలోకి తీసుకోవాలన్న రూలేం లేదు. కానీ తీసుకోకూడదన్న రూల్ కూడా లేదు. తాము అవార్డులు ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాయి. అదే సమయంలో ఏ రాష్ట్ర కోటాలో ఇచ్చారన్నది కూడా ఒక్కోసారి చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. చాలా మంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేశాయి కాబట్టి పక్కన ఆ రాష్ట్రం పేరు పెట్టారని అనుకుంటారు. కేరళకు చెందిన శోభలకు తమిళనాడు కోటాలో పద్మభూషణ్ ఇచ్చినట్లుగా ప్రకటించారు. కానీ ఇలా రాష్ట్రాల కోటాలో పెట్టడానికి .. వారు సిఫారసు చేయాల్సిన అవసరం లేదు.