ఆరు నెలల తర్వాత సినిమా ధియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అన్ లాక్ 5.0 నిబంంధనలతో అనుమతి ఇచ్చింది. దీంతో ప్రశాంతంగా ధియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు రిలీఫ్ దొరికినట్లయింది. వాస్తవంగా ఈ రోజు నుంచే ధియేటర్లు తెరవాల్సి ఉంది. చాలా రోజుల నుంచి ధియేటర్ల ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్న సినీపరిశ్రమకు కూడా ఇది పండగ రోజే అనుకున్నారు. కానీ ప్రారంభోత్సవానికి పెట్టిన షరతుల కారణంగా.. పండగ కాదు.. దండగ అని నిర్ధారించుకున్నారు. ధియేటర్లు తెరవకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో.. ఈ రోజు తెరవాల్సిన ధియేటర్లు తెరవడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని ధియేటర్ యజమానులు కోరుతున్నారు. గతంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు.. విద్యుత్ బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ ఆదేసాలు ఇంకా రాలేదు. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలని…ధియేటర్ల యజమానులు కోరుతున్నారు. లాక్డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ కనీస చార్జీలు ఒక్కో థియేటర్‌కు రూ. 4 లక్షల వరకు బిల్లు వచ్చింది. దీన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ధియేటర్లు తెరిచినా వచ్చే ఆదాయం నిర్వహణకు కూడా సరిపోదని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కొంత సహకారం ఉంటేనే.. మళ్లీ వ్యాపారాలు ప్రారంభించగలుగుతామని అంటున్నారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నానితో ధియేటర్ల యజమానులు చర్చలు జరుపుతున్నారు. అవి సక్సెస్ అయితే ధియేటర్లు తెరిచే అవకాశం ఉంది. లేకపోతే.. మరికొంత కాలం ధియేటర్లు మూతపడి ఉంటాయి.