టీఆర్ఎస్ లో నామినేటెడ్ పోస్టులకు భారీగా డిమాండ్ ఉంది. దాదాపు ఐదారేళ్ళుగా తమకు ఏదో ఒక పదవి కావాలని పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వారితో పాటు.. ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలు వెంట వచ్చిన వారు చాలా మంది పదవులు ఆశిస్తున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తే కొందరినే సంతృప్తి పరచవచ్చు.. పదవులు రాని అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తే.. కింది స్థాయిలో పార్టీకి నష్టం కలుగుతుందనే భయం టీఆర్ఎస్లో ప్రారంభమయింది.
టీఆర్ఎస్ నుంచి చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్ షా రాష్ట్రానికి రానుండటంతో భారీగా చేరికలు ఉంటాయంటున్నారు. ప్రాధాన్యం దక్కని గులాబీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని… హైకమాండ్ కు కూడా సమాచారం అందింది. ఈ పరిస్థితిల్లో నామినేటెడ్ పదవుల పంపిణీ చేస్తే.. అసంతృప్లులు బీజేపీ వైపు వెళ్తారని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే పదవీ కాలం ముగుస్తున్న కార్పొరేషన్ చైర్మన్లకు కూడా మళ్ళీ రెన్యువల్ చేయడం లేదు. 2014 లో టీఆర్ఎస్ అధికారంలోనే వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
రెండో సారి అధికారంలోకి రాగానే వీలయినంత త్వరగా పదవులు పంపిణీ ఉంటుందని నేతలు ఆశించారు. తర్వాత వరుసగా ఎన్నికలు రావటంతో అధిష్టానం ఈ పదవుల భర్తీని పక్కన పెట్టేసింది. ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయని భావించిన నేతలకు బీజేపీ గండం ఎదురొచ్చింది. దీంతో గులాబీ పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వం అసంతృప్తికి గురవుతోంది. ఈ అసంతృప్తి కన్నా.. ఒకరికి పదవి దక్కి… మరొకరికి దక్కకపోతే.. వచ్చే అసంతృప్తినే ఎక్కువ చేటు చేస్తుందని.. టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చాయి. అందుకే.. బీజేపీ బూచి… టీఆర్ఎస్ నేతలకు పదవుల్ని దూరం చేస్తోంది.