నిజామాబాద్ తరహాలో హుజురాబాద్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి తమ నిరసనను దేశం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న నిరుద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వారందర్నీ ఏదో కారణం చెప్పి అదుపులోకి తీసుకుంటున్నారు. నామినేషన్ల గడువు అయిపోయిన తర్వాత వదిలి పెడుతున్నారు. దాదాపుగా వెయ్యి మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిసెంట్లు నామినేషన్ ప త్రాలు పట్టుకుని హుజురాబాద్ వచ్చారు. కానీ ఓ సారి కరోనా నిబంధనలు ఉల్లంఘిచారని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వదిలి పెట్టారు.
ఇక అధికారులు కూడా అంతే. రెండు డోసులు తీసుకున్నట్లుగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తేవాలని ఓ సారి.. పత్రాలు సరిగ్గా లేవని మరోసారి నామినేషన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో రిటర్నింగ్ కార్యాలయం ఎదుట భారీ క్యూగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిలబడి ఉన్నారు. నిజానికి రెండు వందల మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రయత్నాలూ ఫలించడం లేదు. దీంతో ఆమె రిటర్నింగ్ అధికారిపై మండిపడ్డారు. ఆయన కేసీఆర్కు అమ్ముడుపోయారని..తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక మండలాల పోలీసులతో బెదరించి, వెనక్కి పంపిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే నామినేషన్లు స్వీకరించకపోవడంపై ఈసీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.