పోలింగ్ తేదీ వారం రోజుల్లోకి వచ్చిన తరుణంలో ప్రభుత్వం వైపు నుంచి రైతులు, మహిళలు, పెన్షనర్ల బ్యాంక్ అకౌంట్లలలో రోజు మార్చిరోజు డబ్బులు జమ అవుతున్నాయి. పసుపు – కుంకుమ పధకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే నిధులు ఆపాలని.. వైసీపీ కోర్టుకెళ్లింది. అలాగే.. ఇతర పథకాల నగదు పంపిణీని నిలిపివేయడానికి ప్రయత్నించింది. కానీ.. కేంద్రం కూడా.. అలాంటి పనులే చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ పధకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయానికి ఎటువంటి అభ్యంతరం లేదని, తమ అనుమతి అవసరం లేదని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఏపీ ప్రభుత్వం కూడా.. తన పథకాలను అమలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చూసుకుంది.
అన్ని రకాల అనుమతులు ఉండటంతో రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెంచిన రెండు వేల రూపాయల పెన్షన్ ను ఏప్రిల్ 1వ తేదిన ప్రభుత్వం విడుదల చేసింది. పెన్షనర్లకు పంపిణీ కూడా చేసింది, రాష్ట్రంలో సుమారు 54 లక్షల మంది పెన్షనర్లకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పుల ప్రభుత్వం అందించింది. 5వ తేది లోపు ఈ పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే దాదపుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని 70 శాతం పూర్తి చేశారు. ఈ రెండు రోజుల్లో మిగతా మొత్తం కూడా పూర్తి చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో అన్నదాత సుఖీభవ పధకం కింద రైతులకు డబ్బులు ఇవ్వరని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్లేలోపే అన్నదాత సుఖీభవ పధకం కింద ఒక్కో రైతుకు 3వేల రూపాయల చొప్పున ప్రభుత్వం 45 లక్షల మంది రైతులకు 13వందల 49 కోట్ల రూపాయలను బుధవారం వారి బ్యాంక్ అకౌంట్లలో వేసింది.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పసుపు- కుంకుమ పధకానికి కూడా నిదులు సిద్దం చేసింది. పసుపు – కుంకుమ పధకం కింద డ్వాక్రా మహిళలకు 98లక్షల మందికి ఒక్కొక్కరికి 10వేల రూపాయల చొప్పున 9వేల 800 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి, రెండవ విడత నిదులు ఇప్పటి కే డ్వాక్రా మహిళలు చెక్ లను బ్యాంకుల్లో వేసుకుని డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా, మరో నాలుగు వేల రూపాయల చెక్ లను ఈ నెల 4వ తేదిన డ్వాక్రా మహిళలు వేస్తున్నారు. 5,6,7, తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 8వ తేదిన ఈ డబ్బును బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వం 3వేల 800 కోట్ల రూపాయలను ఇందుకోసం విడుదల చేస్తుంది. ఈ డబ్బులు 8వ తేదికి ఆయా బ్యాంకులు డ్వాక్రా మహిళలకు ఇవ్వనున్నాయి.