కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో.. సోదాలపై ఐటీ, ఈడీ ఎందుకు అధికారిక ప్రకటన జారీ చేయడం లేదు..?. దాదాపుగా రెండు రోజుల పాటు 15 చోట్ల సోదాలు నిర్వహించి… ఐటీ, ఈడీ అధికారులు..ఏం తేల్చారు..? . రేవంత్ ఇంట్లో అక్రమాస్తులు దొరికాయని మీడియానే ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తోంది. ఒకరు రూ. 20 కోట్లు అంటారు. మరొకరు.. రూ. వెయ్యి కోట్లు అంటారు. దీనికి సంబంధించిన కొన్ని పత్రాలంటూ… ఐటీ దాడులు ప్రారంభించిన మొదటి రోజే మీడియా చేతికి వచ్చాయి. కనీస నిర్ధారణ లేకుండానే.. అవి నిజమే అన్నట్లుగా ప్రసారం చేసేశారు కూడా. ఆ ప్రచారం ఆయా మీడియా సంస్థలను బట్టి సాగుతోంది. మరి సోదాలు ముగిసిన తర్వాత కూడా.. ఐటీ, ఈడీలు.. ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు.
రేవంత్ రెడ్డి ఓ రాజకీయ నేత. కచ్చితంగా ఆయన అక్రమాలకు పాల్పడితే.. అక్రమాస్తులు బయటపడితే.. ఆ సమాచారాన్ని ప్రజలు తెలియజెప్పాల్సిన అవసరం సోదాలు నిర్వహించిన ఐటీ శాఖపై ఉంది. బయట సర్క్యులేట్ అయిన పేపర్లు.. పత్రాలను చూస్తే..రేవంత్ అత్యంత తీవ్రమైన నేరాలు చేశారనే అనుకోవాలి. అందుకే అరెస్ట్ ఖాయమని అనుకున్నారు. కానీ నోటీసులు మాత్రం జారీ చేసి వెళ్లారు. అంటే బయట తిరుగుతున్న పత్రాలు తప్పా..?. ఈ విషయంలో ఐటీ, ఈడీ అధికారులు ఎందుకు అధికారిక ప్రకటన చేయరు…?. రేవంత్ ఇంట్లో ఏం దొరికాయి.. ఏ కారణాలతో తాము నోటీసులు ఇచ్చామన్న విషయంపై… ఐటీ శాఖ.. వివరాలు వెల్లడించకపోతే… వారు రాజకీయ కుట్రలో భాగమయ్యారన్న అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది.
రాజకీయాల్లో సాధారణంగా… ప్రత్యర్థుల్ని జైలుకు పంపించాలని ఎవరూ అనుకోరు. కానీ వారి ఇమేజ్ పై దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తారు. రేవంత్ విషయంలో అదే జరిగిందని… ఆయన అనుచరులు చెబుతున్నారు. ఓ వైపు రేవంత్ ఇంట్లో ఐటీ సోదాలు ప్రారంభమవగానే.. ఇటు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. ఆ పత్రాలతో మీడియాలో … రేవంత్ రెడ్డికి విదేశాల్లో అక్రమాస్తులనే ప్రచారం ఊపందుకుంది. అది జరుగుతూనే ఉంది. కానీ ఐటీ శాఖమాత్రం స్పందించ లేదు. అసలు రేవంత్ ఇంటిపై దాడులు చేసింది… ఓటుకు నోటు కేసులో దొరికిన రూ. 50 లక్షల సమాచారం తెలుసుకునేందుకా..? లేక రామారావు రామారావు ఇచ్చిన ఫిర్యాదే కారణమా? అనేది ఇంత వరకూ తేలలేదు. కానీ రేవంత్ అనుచరులు మాత్రం.. ముందుగా ఏదో కారణం చెప్పి ఇంట్లో సోదాలు చేస్తే..ఏదో ఒకటి దొరకకపోతుందా అన్న ఉద్దేశంతో… ఐటీ అధికాలను ప్రయోగించారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏం జరిగిందో.. ఐటీ అధికారులు ప్రకటన చేస్తే కానీ క్లారిటీ రాదు.