తిరుపతి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఒక్క ట్వీట్, ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం బీజేపీ నేతల్ని కలవరపరుస్తోంది. అభ్యర్థిగా రత్నప్రభను ఎంపిక చేసిన తర్వాత హైదరాబాద్‌లో అందరూ కలిసి వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఇలా కలిసిన అంశాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే.. మొత్తంగా… వాళ్లు కలిశారు అన్న విషయం మాత్రమే చెప్పింది కానీ.. ఎక్కడా పవన్ కల్యాణ్.. ఆమె విజయం సాధించాలని ఆకాంక్షించారని కానీ… బీజేపీ-జనసేన సమన్వయంతో పని చేసి.. గెలుపు సాధిస్తామన్న ఉద్దేశం ఉన్నట్లు కానీ చిన్న వాక్యం కూడా లేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం.. పవన్ కల్యాణ్ ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారని ప్రకటించుకున్నారు. రోడ్ మ్యాప్ ఖరారైన తర్వాత పవన్ కల్యాణ్ ప్రచారంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
అయితే జనసేన వైపు నుంచి రత్నప్రభ అభ్యర్థిత్వంపై పెద్దగా ఆమోదం లభించినట్లుగా కనిపించడం లేదు. పన్ కల్యాణ్.. తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్చేయడం ఆపేసి చాలా రోజులయింది. ఏమైనా ఉంటే జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారానే చెబుతున్నారు. రత్నప్రభకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా ట్విట్టర్ అకౌంట్లో కనిపించడం లేదు. ఇటీవల సమస్యల విషయంలో పవన్ కల్యాణ్ వీడియోలు విడుదల చేస్తున్నారు. అలా రత్నప్రభ కోసం వీడియో కూడా విడుదల చేయలేదు. నామినేషన్ వేయడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో రేపు నెల్లూరులో నామినేషన్ వేయాలని రత్నప్రభ నిర్ణయించుకున్నారు. కానీ జనసేన పార్టీ భాగస్వామ్యంపై మాత్రం చర్చ నడుస్తోంది.
జనసేన మద్దతు లేకపోతే.. బీజేపీ నేతలు జన సమీకరణకు కూడా ఇబ్బందులు పడతారు. వారి కార్యకర్తలోనే జనసేన జెండాలు మోయించుకుందామన్నా… కార్యకర్తలు దొరకని పరిస్థితి ఉంటుంది. అందుకే బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. రత్న ప్రభకు మద్దతుగా పవన్ కల్యాణ్‌తో ముందుగా ఓ ప్రకటన చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ మాత్రం చాన్సివ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది.