ఏపీ ప్రభుత్వం అమరావతి పరిధిలోని భూములను వేలం వేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని సార్లు వేలం వేసింది. అయితే వచ్చిన స్పందన శూన్యం. ఎవరూ రావడం లేదు. భారీగా ధర నిర్ణయించడం మాత్రమే కాదు అమరావతిని తరలిస్తామని వైసీపీ ఇప్పటికీ చెబుతోంది. ఇలాంటి సమయంలో ఎవరూ కొనేందుదుకు ముందుకు రావడం లేదు. ఈ వేలానికి పిలుపునిస్తే కనీసం బిడ్లు కూడా దాఖలు చేయడం లేదు.
కొద్ది రోజుల కిందట అమరావతి పరిధిలోని ప్రభుత్వ స్థలాలకు వేలం నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. 56 ఎకరాల్లో వంద నివాస, వాణిజ్య ప్లాట్లను వేలానికి ఉంచారు. కానీ గడువులోగా కేవలం ముగ్గురే దరఖాస్తు చేశారు. అప్సెట్ ధర కన్నా చ.గజానికి కేవలం రూ.వంద ఎక్కువతో ఒక్కరే బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఈ వేలం కోసం ప్రత్యేకంగా వంద మందికిపైగా సిబ్బందిని సీఆర్డీఏ నియమించింది. ప్రచారం కోసం రూ.50 లక్షలు ఖర్చు పెట్టింది. కానీ అంత కూడా రాలేదు.
ఎవరూ రాకపోయినా సరే.. ఈసారి కోర్ క్యాపిటల్‌లోని 14 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఇందులో గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీకి గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన పదెకరాలు, ఇండో-యూకే ఇన్స్టిట్యూట్కు ఇచ్చిన నాలుగెకరాలు ఉన్నాయి. అసలు ఎవరూ రాకపోయినా ఎందుకు ఈ స్థలాలు అమ్మకానికి పెడుతున్నారన్నది మిస్టరీగా మారింది. అమరావతి స్థలాలకు తక్కువ ధర నిర్ణయించడానికి ప్రణాళికాబద్దంగా ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ముందు ముందు తీవ్ర దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.