వైఎస్ఆర్సిపి ప్లీనరీ సమావేశంలో ప్రతిపక్ష నేత తెలుగుదేశం చేస్తున్న ఒక ప్రధాన ప్రచారానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగిస్తుంది. అమరావతిని, సిఆర్డిఎ పేరును, అటు విజయవాడ ఇటు గుంటూరు అన్న పేర్లను వత్తివత్తి పలికారు. తాను అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు గనకే ఇలా చెబుతున్నానని వివరించారు. ఆ ప్రయత్నం జరగదని చెప్పడానికి ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. వాస్తవానికి ఎవరు అధికారంలోకి వచ్చినా శాసనసభ తీర్మానించిన, ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా తరలిస్తారు? పైగా ఏ దశలోనూ ఏ రాజకీయ పార్టీ కూడా అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని ఆక్షేపించలేదే? అంతకు ముందు ఆ తర్వాత కూడా ఈ ఎంపికపై భిన్నాభిప్రాయాలుండొచ్చు. కాని కొన్నిఅడుగులు పడిన కీలక నిర్ణయాన్ని మార్చడం అవాస్తవికత అవుతుందని అందరికీ తెలుసు. రాయలసీమలో కొంత బలం కలిగిన జగన్ గతంలో కోస్తాజిల్లాల్లో వస్తుందనుకున్న ఓటింగు సీట్లు రాక ప్రతిపక్షంలో వుండిపోయారు. ఆ ప్రాంతాన్ని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు గాని రాజధానిని మార్చే పని ఎందుకు పెట్టుకుంటారు? అయితే రాజధానికి ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పడం ప్రభుత్వ ప్రచారం వ్యూహాత్మకమైంది. ఈ వివరణతోనే ఆగేది కాదు కూడా.