అమలాపురంలో జరిగిన ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. స్వయంగా ఓ మంత్రి ఇంటిపై విరుచుకుపడి పెట్రోల్ తీసుకు వచ్చి తగలబెట్టేశారు. మరో ఎమ్మెల్యే ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అధికార పార్టీ ముఖ్యులపై ఇంత తీవ్రమైన దాడి జరిగితే.. అది సామాన్యమైన విషయం కాదు. వెంటనే నిందితుల్ని .. దాని వెనుక ఉన్న కుట్ర దారుల్ని పట్టుకుని తమ సత్తా చూపిస్తారు. కానీ విచిత్రంగా అమలాపురం ఇష్యూలో పోలీసులు అసలు ఇంటర్నెట్ను వారం రోజుల పాటు నిలిపివేసి.. అదే గొప్ప విజయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెట్టి అనుమానితుల వాట్సాప్ చాట్స్ చూస్తున్నామని… అందులో పోలీసులు భోజనానికి వెళ్లారు.. ఇదే మంచి టైం.. యుద్ధానికి సిద్ధం అంటూ చాట్స్ ఉన్నాయని చెబుతున్నారు. కానీ పట్టుకున్న నిందితులు ఎవరెవరు..? వారి వెనుక ఉన్నదెవరు..? ఏ ఉద్దేశంతో వారు ఈ దాడులకు పాల్పడ్డారు వంటి విషయాలను మాత్రం వెల్లడించడం లేదు. సీసీ టీవీల్లో , మీడియా కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం అరెస్ట్ చేసిన వారిలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలు.. మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులే.
అసలు కోనసీమ ఉద్యమాన్ని రెచ్చగొట్టి.. కోనసీమ సాధన సమితి పేరుతో రాజకీయాలు చేసింది కూడా.. వైసీపీ నేత. ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. అయితే పోలీసులు ఈ మాత్రం ఈ కుట్రను చేధించడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నారు. తాను నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పడానికి రోజుకో మాట చెబుతున్నారు కానీ.. అసలు విషయం చెప్పడం లేదు. దీంతో విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా.., ఇదందా వైసీపీ నేతల పనేనన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.