ట్వీట్ల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు. చాలా రీసెర్చ్ లు చేసి మరీ రకరకాల పాయింట్లు తీసుకొచ్చి ట్విటర్ లో గుమ్మరిస్తున్నారు. తను ఎప్పుడో చదివిన పుస్తకాల్లో అండర్ లైన్ చేసుకున్న వాక్యాలు, సేకరించుకున్న కొటేషన్లు.. ఇలా అన్నీ వాడేస్తున్నారు. పదిహేడేళ్ల కిందట ఓ నవల చదువుతూ.. దాన్లో నచ్చిన వాక్యాలను రాసి పెట్టుకున్న నోట్స్ కూడా ట్వీట్ చేశారు. సింగపూర్ ని అద్భుతంగా నిర్మించిన లీ క్వాన్ యు గురించీ ట్వీటారు. ఇలా తనకు తెలిసినవీ, తనకు తారసపడినవీ… అన్నీ ట్విటరో పడేస్తున్నారు. ఈ ట్వీట్ల లక్ష్యం ఒక్కటే… మీడియా స్పందించాలి. మరీ ముఖ్యంగా, పవన్ ఆశిస్తున్నది ఆ మీడియా అధినేతల స్పందనే.
గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ ట్వీట్లపై వార్తలుగానీ, బ్రేకింగ్ స్క్రోలింగులుగానీ కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా పవన్ టార్గెట్ చేసుకున్న ఆ ఛానెళ్ల నుంచి ఏమాత్రం స్పందనా లేదు. చూస్తుంటే… పవన్ విషయంలో ఆ మీడియా వ్యూహం ఫలించనట్టే కనిపిస్తోంది. పవన్ విషయంలో ఏదీ మాట్లాడొద్దు అని కూర్చున్నారు.. అనుకున్నదే అమలు చేస్తున్నారు. అంతేకాదు, వారు ఆశించినట్టుగానే ఫలితం ఉందనీ చెప్పుకోవచ్చు.
పవన్ తో వీలైనంత ఎక్కువగా వాగించాలన్నది సదరు మీడియా వ్యూహం. తద్వారా ఆయన మరింత ఎక్కువగా చేసే వ్యాఖ్యలూ ట్వీట్లను జనం లైట్ గా తీసుకోవడానికి అలవాటు పడతారు కదా! అయితే, ఈ వ్యూహం పవన్ కల్యాణ్ కి ఇంకా అర్థమౌతోందో లేదో మరి! తనను మౌనంతో ఢీ కొడుతున్నారని ఆయన విశ్లేషించుకోవడం లేదో ఏమో..! ఒకవేళ ఈ వ్యూహాన్ని ఆయన గ్రహించే ఉంటే… తన పంథా మార్చుకునేవారు కదా. లేదంటే, ఇలా ట్వీట్లు చేస్తూ పోతే.. ఎప్పటికైనా స్పందించి తీరతారన్నది పవన్ నమ్మకం కూడా కావొచ్చు. ‘సత్యానికి ఎల్లప్పుడూ బలమైన వాదన ఉంటుంది’ అంటూ ఆయనే ఓ ట్వీట్ చేశారు. దాన్నే ఫాలో అవుతున్నట్టున్నారు. అయితే, ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు… సందర్భోచితంగా ఉంటున్నాయా లేదా అనేది కూడా తరచి చూసుకోవాలి కదా! ఏదేమైనా, ఎలాగైనా వారిని లాగాని పవన్ ట్వీట్ వార్ చేస్తున్నారు, ఎలాగైనా పవన్ తో వాగించాలని వారు మౌనంగా పవన్ తో ట్వీటిస్తున్నారు. ఇందులో ఎవరిది పైచెయ్యిగా కనిపిస్తోందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలా..!