ఏపీ బీజేపీ నేతల తాపత్రయాన్ని ప్రజలు కనీసం పట్టించుకోవడం లేదు. శ్రీశైలంలో మత చిచ్చు పెట్టి రాష్ట్రం మొత్తం అంటించి ఏదో సాధిద్దామని అనుకున్నారు. బీజేపీ అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని డైలాగులు చెప్పి.. రచ్చ చేద్దామనుకున్నారు. కానీ ఏం చేసినా తుస్సుమంటోంది. ప్రజలు వారి పోరాటాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. కర్నూలులో సభ పెట్టిన బీజేపీ ముఖ్య నేతలు.. వైసీపీపై ఘాటు విమర్శలే చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
సోము వీర్రాజు చాలా ఘాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి దేశ ద్రోహి అని కూడా విమర్శించారు. కానీ ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ప్రజాసమస్యల మీద కంటితుడుపు ప్రకటనలు చేసి.. అన్ని విధాలుగా వైసీపీకి అండగా ఉంటున్నారని ఏపీ బీజేపీ నేతలపై ప్రజలకు గట్టి అనుమానం ఉంది. దీన్ని తుడిపేసుకోవాలంటే ప్రకటనలతో సాధ్యం కాదు. అంతకు మించి ఏదో ఓ చర్య తీసుకోవాల్సి ఉంటుంది.కానీ బీజేపీ విషయంలో అలాంటివేమీ ఉండటం లేదు. ఓ వైపు ఘాటు ప్రకటనలు చేసినప్పుడు వైసీపీ నేతలు బీజేపీ లీడర్లను దారుణంగా తిట్టి పోస్తున్నారు.
వారికి కౌంటర్ఇవ్వడానికి కూడా బీజేపీ నేతలకు చేతులు రావడం లేదు. ఎంత చెప్పినా..బీజేపీలో ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న వర్గం వైసీపీకి మేలు చేయడానికే పని చేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది కానీ తగ్గడం లేదు. దీన్ని తగ్గించుకుని ఫైర్ చూపిస్తే తప్ప.. ప్రజలు బీజేపీ అంటే పుష్పం అనే అనుకుంటే.. ఫైర్ అని అనుకోరు. నాయకత్వం మార్చితేనే ఆ ఫైర్ కనిపించే అవకాశం ఉంది. లేకపోతే లేదనేది .. చాలా కాలం నుంచి బీజేపీలోనే ఉన్న వారి మాట.