ఓటు బ్యాంకు రాజకీయాలను ఒంటబట్టించుకున్న రాజకీయ పార్టీలు, నిజంగా ప్రజలకు రైతులకు మేలు చేసే పనులను పట్టంచుకోవు. తెరాస కూడా అలాగే ప్రవర్తిస్తోంది. రుణమాఫీ పేరుతో వేల కోట్లు భరించడానికి తెరాస ప్రభుత్వం సిద్ధ పడింది. నిజంగా అది రైతులకు ఏమేరకు ఉపయోగపడిందనేది వేరే విషయం. అయితే, రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని మాత్రం కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులకు కరెంటు బిల్లులు కొంత భారమవుతాయి. అందుకే ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. దీనివల్ల ఖజానాపై వేల కోట్ల భారం పడుతోంది. అసలు ఉచిత విద్యుత్తు పథకం అవసరమే లేని విధంగా కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాన్ని రెండేళ్లుగా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. అదే, బోర్లకు సోలార్ పంపుసెట్లను అమర్చే పథకం.
దీనివల్ల సాధారణ విద్యుత్తును వ్యవసాయ రంగానికి సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు. రైతులు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఉచిత విద్యుత్తు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల భారం భరించే పని ఉండదు.
తెలంగాణలో 2014-15లో 4,225 బోర్లకు సోలార్ విద్యుత్ పంపుసెట్ల ఏర్పాటుకు 38 శాతం రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపింది. నిధులు కూడా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో 200 కోట్లు కేటాయించింది. కానీ విడుదల చేయలేదు. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాయితీని వాపస్ తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ హెచ్చరిక పనిచేసింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పథకం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఎవరైనా రైతు 5 హార్స్ పవర్ సౌర పంపుసెట్ ఏర్పాటు చేసుకుంటే 4.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1.62 లక్షలు రాయితీగా ఇస్తుంది. డిస్కం 2.03 లక్షలు భరిస్తుంది. రైతు వాటా కింద 50 వేలు చెల్లించాలి. దీనివల్ల జీవితాంతం రైతుకు కరెంటు బిల్లు భారం ఉండదు. దీనివల్ల వ్యవసాయ రంగానికి కరెంటును సరఫరా చేయాల్సిన అవసరం డిస్కంలకు ఉండదు. వేల కోట్ల రూపాయలను ఉచిత విద్యుత్ పథకానికి కేటాయించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి డిస్కంలు భరించే భారాన్ని ప్రభుత్వం కూడా పంచుకోవచ్చు. ఇలా దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అప్పుడు గృహ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి ఏ ఇబ్బందీ ఉండదు.