తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు. వారిలో చాలా మంది యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఏ ముహుర్తాన రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారో .. ఈటల రాజేందర్ బీజేపీలో చేరారో కానీ.. పరిస్థితులు తిరగబడటం ప్రారంభించాయి. బీజేపీలో చేరిన ఒక్కొక్కరు జారుకోవడం ప్రారంభించారు. ఇప్పటికే పలువురు బీజేపీకి గుడ్ బై చెప్పగా.. మరికొందరు అదే బాటలో ఉన్నారు. దాదాపుగా అందరూ వలస నేతలే. మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి గుడ్ బై చెప్పి.. ఈటలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు.
ఆయన టీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించారు కానీ.. ఆయనను ఆ పార్టీలో చేర్చుకుంటారో లేదో టీఆర్ఎస్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక హూజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఇనగాల పెద్దిరెడ్డి కూడా రాజీనామా బాట పట్టారు. ఆయన కూడా వలస నేతే. ఇటీవల బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ చేరుతానని తెలిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో మళ్లీ చేరుతానని ప్రకటించారు. ఇటీవల బీజేపీలో చేరిన స్వామిగౌడ్ కూడా అసంతృప్తిగా ఉన్నారని.. ఆయన రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు బోడ జనార్ధన్, చాడా సురేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల బీజేపీలో చేరిన మరో రేవంత్ సన్నిహితుడు కూన శ్రీశైలం గౌడ్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇలా వలస వెళ్లిపోతున్నా… పట్టించుకోవడం లేదు. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య వర్గ పోరాటం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అంటున్నారు. బండి సంజయ్ ప్రమేయం లేకుండా పార్టీలో చేరిన వారే ఎక్కువ కావడంతో ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి వలసలు అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.