తెలంగాణా ఉద్యమాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళిన నేతలు ఎవరు? తెలంగాణా ప్రజలు, ఉద్యమకారులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటేనే ఆవేశంగా రియాక్టయ్యే పరిస్థితులను సృష్టించింది ఎవరు? కెసీఆర్, కోదండరామ్, కెటీఆర్, హరీష్రావులాంటి వాళ్ళనుకుంటున్నారా? ముమ్మాటికీ కాదు. తెలంగాణా ప్రజలను, కెసీఆర్‌ని రెచ్చగొట్టి సమైక్యాంధ్ర హీరో అని అనిపించుకోవాలనుకున్న లగడపాటి రాజగోపాల్, తెలంగాణా ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రిని అన్న ఇంగితాన్ని మరిచి తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తావో చేసుకోపో అని హరీష్‌రావుని హెచ్చరించిన ఇంకో సమైక్యాంధ్ర వీరుడు, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతూ ఉంటే ఎటూ చెప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరించిన అత్యంత అనుభవజ్ఙుడు, ప్రపంచానికి పాఠాలు చెప్పినవాడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఓదార్పు యాత్రలో రాళ్ళదాడి దెబ్బకే తెల్లజెండా చూపించిన పులిబిడ్డ వైఎస్ జగన్, ఒకసారి సమైక్యాంధ్ర అని, ఆ తర్వాత సామాజిక తెలంగాణా అని, ఫైనల్‌గా సోనియా పాదదాసుడిని, ఆమె ఏం చెప్తే అదే అని కామెడీ చేసి రాజకీయాలలో ట్రూ కమెడియన్ అనిపించుకున్న రీల్ హీరో చిరంజీవి, అంతా తగలబడిపోయే వరకూ సైలెంట్‌గా ఉండి చివరి మంటల్లో తన రాజకీయ జీవితాన్ని వెలిగించుకోవడానికి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్…..ఈ మహానుభావులందరూ కలిసి సీమాంధ్ర ప్రజలను నిలువునా ముంచారు.
మరి అప్పట్లో అంతలా ఆవేశపడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడేం చేస్తున్నారు. విభజన టైంలో మా మాట చెల్లుబాటు కాలేదంతే. మేం నిజాయితీగానే పోరాడాం అని తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా క్రెడిట్ తీసుకోవడంలో మాత్రం ఒకరితో ఒకరు పోటీపడ్డారు. అది కాస్తా వెంకయ్య అకౌంట్లో పడింది. ఎపికి సిఎం అయిన కొత్తలో తెలంగాణాలో కూడా పొడిచేస్తా, చించేస్తా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు. తెలంగాణా నుంచి ఎపికి రావాల్సిన అన్నీ తీసుకుని వస్తా అని కూడా చెప్పాడు. హైదరాబాద్‌లో పదేళ్ళు ఉంటాం అని కూడా చెప్పాడు. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత నుంచి మాత్రం పూర్తిగా బిచాణా ఎత్తేశాడు. ఇప్పుడైతే బాలకృష్ణ, చంద్రబాబు, కెసీఆర్ కుటుంబాలు బాగా దగ్గరైనట్టుగా కనిపిస్తోంది. ఇక లగడపాటి రాజగోపాల్ అయితే కెసీఆర్‌ని పొగిడే అవకాశం ఎలా దొరకుతుందా అని చూస్తున్నాడు. ఇంతవరకూ అలా వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. చాన్స్ దొరికితే చాలు ‘కెసీఆర్ దేవుడు’ అని అనేలానే ఉన్నాడు. చంద్రబాబుని, టిడిపి నాయకులను తప్ప ఇంకెవరినీ తిట్టను అని వైఎస్ జగన్ ఏమైనా ఒట్టు పెట్టకున్నాడేమో తెలియదు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కెటీఆర్‌తో ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతున్నారు. కెటీఆర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలంగాణా ప్రజలందరికీ తెలియాలని తాపత్రయపడుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు మాత్రం పూర్తిగా ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి గజినీలయినట్టున్నారు.
మొత్తంగా కంటికి కనిపిస్తున్న నిజం ఒక్కటే. తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నీళ్ళు, నిధులు, ఆస్తులేవీ కూడా రావు. కెసీఆర్‌ని అడిగే దమ్ము, ధైర్యం, తెగువ ఈ నాయకులెవ్వరికీ లేదు. ఎందుకంటే చంద్రబాబు, జగన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, లగడపాటి, రామోజీరావు….లాంటి వాళ్ళ బిజినెస్ మూలాలన్నీ తెలంగాణాలోనే ఉన్నాయి కనుక. వ్యాపార లావాదేవీలు లేకుండా, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సీమాంధ్ర సమాజం కోసం, సీమాంధ్ర ప్రజల కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా?