తెలంగాణలో రాజకీయపార్టీలు వైఎస్ షర్మిలను పట్టించుకోవడం లేదు. తాను పార్టీ పెట్టబోతున్నానని ఖమ్మం గడ్డ మీద ఆమె ప్రకటించారు. అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు ఓ కన్నేశాయి. ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందోనని పరిశీలించాయి. చివరికి…స్పందించేంత పెద్ద పార్టీ కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.అందుకే.. షర్మిల సభపై కొంత మంది రాజకీయ నేతలు వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు కానీ.. పార్టీల పరంగా అయితే… నో కామెంట్ విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాయి.
షర్మిల ఖమ్మం సభలో ఎక్కువగా కేసీఆర్ను టార్గెట్ చేశారు. హామీలు అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. మామూలగా ఆమె చేసిన విమర్శలకు… టీఆర్ఎస్ వైపు నుంచి దూకుడైన రిప్లయ్ రావాలి. అవసరంగా స్పందించి హైప్ ఇవ్వడం ఎందుకని టీఆర్ఎస్లో నిర్ణయం జరిగింది. అందరికీ అదే సమాచారం పంపారు. షర్మిల పార్టీ విషయంలో.. అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కాంగ్రెస్ కూడా అంతే.. బీజేపీ కూడా అంతే . అధికారికంగా స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్లో వీహెచ్… బీజేపీలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం స్పందించారు. కానీ వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
షర్మిల రాజకీయ పార్టీ ఆరంగేట్రం మొత్తం ఓ ఈవెంట్లాగా… జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసుకునేందుకు హంగామా చేస్తున్నారు కానీ… ప్రజల్లో స్పందన లేదని… పార్టీలు నమ్ముతున్నాయి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభకు పట్టుమని ఐదు వేల మంది కూడా రాలేదని… అంచనా వేశారు. వచ్చిన జనం కన్నా.. వాహనాలే ఎక్కువున్నాయన్న అభిప్రాయం కూడా వినిపించింది. జనసమీకరణ చేసే పార్టీ నిర్మాణం కూడా లేదని… ఆమె పార్టీ మొదట్లోనే తేలిపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.