హైదరాబాద్: కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత, బడా పారిశ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు రు.12 కోట్ల మేర తమకు బకాయి పడటంతో వాణిజ్యపన్నుల శాఖ ఆయనకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న స్థలాన్ని నిన్న వేలానికి పెట్టింది. ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్‌లో పురాతన భవనం ఉన్న 1160 గజాల ఆ స్థలాన్ని కొనటానికి పెద్దగా ఆసక్తి కనబడలేదు. ఆ ప్రాంతంలో గజం ధర 35-40 వేలు ఉండగా వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఈ స్థలానికి లక్ష రూపాయలతో మొదలు పెట్టటంతో ఎవరూ ముందుకు రాలేదు. ధర తగ్గిస్తే వేలంలో పాల్గొంటామని వినతులు రావటంతో మరోసారి వేలం నిర్వహిస్తామని అధికారులు వెళ్ళిపోయారు.
కావూరి సాంబశివరావు వాణిజ్యపన్నుల శాఖకే కాక బ్యాంకులకు కూడా భారీ స్థాయిలో బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన 18 బ్యాంకులకు రు.1,000 కోట్ల మేర బకాయి ఉన్నారంటూ ఆ బ్యాంకుల సిబ్బంది ఇటీవల హైదరాబాద్‌లో కావూరి సంస్థ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్విహంచారు. ఈ కంపెనీకి కావూరి కుమార్తె వాణి ఎండీగా ఉన్నారు. ఈ సంస్థ సుల్తాన్ బజార్‌లోని ఆంధ్రాబ్యాంక్ ఒక్కదానికే రు.200 కోట్ల బకాయి పడింది.