కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. అదే టైపులో శ్రీరెడ్డి తుమ్మినా దగ్గినా టీవీల్లో డిబేట్లు కండక్ట్ చేశారు. ఆమె చూపుతోన్న ఆధారాల్లో నిజమెంత? అసలు అవి సరైనవేనా? అనేది చూడకుండా సో కాల్డ్ సంఘసంస్కర్తలను టీవీల్లో కూర్చోబెట్టి గంటల తరబడి డిబేట్లు నడిపారు. పవన్ కల్యాణ్ ఛాంబర్ దగ్గర చేసిన హడావుడితో సీన్ పూర్తిగా మారింది. సినిమా ఇండస్ట్రీ జనాలు మీడియాపై కత్తి గట్టడంతో ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు. ఎంతంటే… “పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను తిడుతున్నారు, నేను కేటీఆర్, కవితలను కలసి నా గోడు వెళ్లబోసుకుంటాను, సుప్రీమ్ కోర్టు లాయర్లతో మాట్లాడి కేసులు వేస్తా” అని శ్రీరెడ్డి ప్రెస్మీట్ పెట్టినా ఎవరూ పట్టించుకోనంత. గతంలో కత్తి మహేష్ ఇదే రీతిలో పవన్ అభిమానులు నాపై మాటల దాడి చేస్తున్నారంటే గంటల తరబడి చర్చలు నిర్వహించారు. శ్రీరెడ్డి విషయంలో అటువంటి హడావుడి ఎందుకు చేయడంలో మెజారిటీ జనాలకు ఒక క్లారిటీ వచ్చింది.
మొన్నటికి మొన్న జర్నలిస్టు సంఘాలు తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశమై కొన్ని ప్రశ్నలను సంధించింది. అందులో “శ్రీరెడ్డి బూతుమాట మాట్లాడిన తరవాత టీవీ న్యూస్ ఛానల్స్ స్వీయ నియంత్రణలో భాగంగా ఆమెకు స్టూడియోల్లో అవకాశం ఇవ్వలేదు. న్యూస్ ఛానల్స్ సానుకూల స్పందన తరవాత కూడా వ్యాపార ప్రయోజనాల కోసం రెచ్చగొట్టడం, ఆరోపణలు చేయడం భవిష్యత్ సంబంధాలను పూర్తిగా నాశనం చేస్తుందని మీకు తెలియదా?” ఈ ప్రశ్న ఒకటి. శ్రీరెడ్డికి ఇంపార్టెన్స్ తగ్గిందా? తగ్గించారా? అనేదానికి ఆన్సర్ ఈ ప్రశ్నలో దొరుకుతుంది. నిన్నటి ప్రెస్మీట్ మాత్రమే కాదు. అంతకు ముందు మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా బాగోలేదని, వరస్ట్ డైరెక్షన్ అనీ, ఓన్లీ మహేశ్ స్టార్డమ్ వల్ల సినిమా ఆడిందనీ శ్రీరెడ్డి ట్వీట్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తరవాత ట్వీట్లు డిలీట్ చేసిందనుకోండి. ఇకపై శ్రీరెడ్డి ఎంత హడావుడి చేసినా, పోరాటం చేసినా టీవీల్లో కనిపించే అవకాశాలు తక్కువ అన్నమాట.