బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో చాలా ఆసక్తికరమయిన, విచిత్రమయిన విశేషం ఏమిటంటే జనతా పరివార్ లో నితీష్ కుమార్ కి చెందిన జేడీయు, లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కానీ అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్లి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీ ఇంతవరకు ఒకే వేదికపై నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కారణాలు ఏవయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఇష్టపడలేదు. అలాగే లాలూ కూడా రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాలుపంచుకోవడానికి ఇష్టపడలేదు..ట!
ఇంకా ఇటువంటి విచిత్రాలు చాలానే ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి సోనియా గాంధీతో కలిసి ఒకే వేదికపై నుండి ప్రచారానికి ఇష్టపడ్డారు కానీ రాహుల్ గాంధీతో కలిసి ప్రచారానికి ఇష్టపడలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అపరిపక్వమయిన ప్రసంగాలతో తనకు పడే ఓట్లు కూడా ఎక్కడ చేజారిపోతాయనే భయంతోనే. అందరికీ నవ్వు తెప్పించే మరో విశేషం ఏమిటంటే “నితీష్ కుమార్ చాలా సమర్ధమయిన పరిపాలన అందించగలరు.. కనుక ఆయనకే ఓటేసి గెలిపించమని రాహుల్ గాంధీ ప్రచారం చేయడం.నితీష్ కుమార్ ఎన్నడూ కాంగ్రెస్ “గొప్పదనం” గురించి, దాని ‘ఎవ్వర్ గ్రీన్ హీరో’ రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి కానీ ఎన్నడూ ఒక్క ముక్క మాట్లాడలేదు.
ఈ ముగ్గురుకీ మరొకరు తోడయ్యారు. ఆయనే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన కూడా నితీష్ కుమార్ కి మద్దతు ఇస్తున్నారు. అయితే ఆయన కూడా నితీష్ కుమార్ కి ఓటేయమని ప్రజలను కోరుతున్నారే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కి ఓట్లు వేయమని అడగడం లేదు. రాహుల్ గాంధీ కూడా నితీష్ కుమార్ కే ఓటేయమని ప్రజలని అడుగుతున్నారు తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కి వేయమని అడగడం లేదు! నితీష్ మంచి పరిపాలకుడు అని ఇద్దరూ ఒప్పుకొంటున్నారు కానీ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని గట్టిగా చెప్పలేకపోతున్నారు.అంటే ఏమనుకోవాలి? ఒకరితో ఒకరు మాట్లాడుకోరు..ఒకరంటే ఒకరికి ఏమాత్రం గౌరవం, నమ్మకం విశ్వాసం లేవు. అందరూ కలిసి ఒకే వేదికపై కలిసి నిలబడేందుకు కూడా ఇష్టపడరు. కానీ వాళ్ళు అందరూ కలిసి బిహార్ రాష్ట్రానికి సుస్థిరమయిన ప్రభుత్వం అందిస్తారుట! రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారుట!