ప్రత్యేకహోదా అంశంపై ఏపీ రాజకీయ నాయకులకు, ప్రజలకు ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఆ స్పెషల్ స్టేటస్ ను అందరూ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. గత ఎన్నికల్లో ఎవరూ ప్రత్యేకహోదా తెస్తామని మాట్లాడలేదు. కాంగ్రెస్ మాత్రం హామీ ఇచ్చారు. ఆ పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నా ప్రత్యేకహోదా ప్రస్తావన లేదు.
బీహార్ విషయంలో కూడా ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఉంది. ఆయన కేంద్రాన్ని అడుగుతారని కొన్ని జాతీయ మీడియాలు చెప్పాయి కానీ అలాంటి ఆలోచన చేయలేదు. కానీ ప్రత్యేక సాయం మాత్రం అందుతుందని అంటున్నారు. చంద్రబాబుకు ఏపీకి ప్రత్యేక సాయాలు, ప్రాజెక్టులు ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు కాబట్టి.. ఎవరూ పెద్దగా ఆందోళన చెందడం లేదు. రాజధాని, పోలవరం వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లే.
అసలు ప్రత్యేకహోదా వస్తే ఏం వస్తుందో ఎవరికీ తెలియదు. సరిహద్దుల్లో పర్వతప్రాంత రాష్ట్రాలకు మాత్రమే ఈ హోదా ఇస్తారు. దాని వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ గతంలో ఏపీకి ఇచ్చారు. గత ఐదేళ్లలో అప్పులు ఇస్తే చాలన్నట్లుగా వ్యవహరించారు. హోదా లేకపోయినా ఇప్పుడు కేంద్రం నుంచి గరిష్ట ప్రయోజనాలు పొందితే చాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.