అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే.. తాము లక్షల్లో భర్తీ చేశామని ప్రకటించేసిన ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయలేదు. త్వరలో భర్తీచేయబోయే ఉద్యోగ ప్రకటనల్లో ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తారు. కానీ.. అరకొర ఉద్యోగాలున్నాయని రాష్ట్ర వ్యాప్తంగాఆందోళన జరుగుతోంది. అయితే ఈ రిజర్వేషన్ల ప్రకటన విషయంలో ప్రధానంగా తెరపైకి వస్తున్న విషయం కాపు రిజర్వేషన్లు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం నిలిపివేసింది.
కేంద్రం ఎన్నికలకు ముందు… ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి.. పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. అవసరమైన మార్పులు చేసుకుని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అన్వయించుకోవచ్చు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇంతకు మించిన చాన్స్ దొరకదనుకున్న చంద్రబాబు… ఆ పది శాతంలో ఐదు శాతం కాపులకు కేటాయించారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేశారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భాగంగా కల్పించారు. మిగిలిన వారికి ఐదు శాతం ఇస్తారు. రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం ఉంటుంది. అయితే జగన్ సీఎం కాగానే ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ఆపేశారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులు చేయకూడదని.. కొంత మంది బీజేపీ , వైసీపీ నేతలు వాదించారు. అలా చేసినా చెల్లదన్నారు. కానీ.. కేంద్రం చేసిన చట్టం.. రిజర్వేషన్లు అమలు.. కేంద్రానికే పరిమితం. కేంద్రం భర్తీ చేసే ఉద్యోగాలు, విద్యాసంస్థలల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే అది చెల్లుబాటవుతుంది. రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే.. ఏపీలోని ఉద్యోగ, విద్యా ఇతర అంశాల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. ప్రభుత్వానిదే నిర్ణయం. గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఈ కోటా బిల్లలు మార్పులు తెచ్చి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో యాథవిధిగా.. కోటా కిందట.. రిజర్వేషన్ సర్టిఫికెట్లు కాపులకు జారీ చేస్తే.. వారికి అన్ని రకాల ప్రయోజనం కలుగుతుంది. కానీ.. జగన్ సర్కార్ మాత్రం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకూడదన్నట్లుగా వ్యవహరించింది.
వైసీపీలో ఉన్న కాపు నేతలెవరూ.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం లేదు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన వారి నోరూ పెగలడం లేదు. వీరు కేవలం.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రిజర్వేషన్ల ఉద్యమం చేస్తారని.. ఏ రూపంలో రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా పట్టించుకోరనే ముద్రపడిపోయేప్రమాదం కనిపిస్తోంది. దీని వల్ల శాశ్వతంగా.. కాపులు రిజర్వేషన్ల హక్కులు కోల్పోవడం ఖాయంగా కనిపస్తోంది. వారు ఇక ఎప్పుడు ఉద్యమంమ చేసినా దాన్ని రాజకీయంగానే చూస్తారు.