సంక్రాంతి సమరం ముగిసింది. మెల్లిమెల్లిగా లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ అదిరిపోయిందని అభిమానులు సంబర పడుతున్నారు. చిరు స్టెప్పుల గురించీ, ఇన్నేళ్లు గడిచినా ఎక్కడా తగ్గని ఈజ్ గురించీ.. కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. బాలయ్య వందో సినిమా చరిత్రలో నిలిచిపోయినందుకు నందమూరి ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. బాలయ్యకు జేజేలు పలుకుతూ అటు క్రిష్నీ పొగిడేస్తున్నారు. ఈ టోటల్ కథలో… వినాయక్ ప్రస్తావన ఎవ్వరూ తీసుకురాకపోవడం విచిత్రం! కత్తి రీమేక్‌ని ఎంచుకొన్న వినాయక్… తాను సొంతంగా చేసిందేం లేదన్నది చాలామంది అభిప్రాయం. బహుశా అది నిజం కావొచ్చు. కానీ.. వినాయక్ కష్టం మాత్రం గుర్తెరుగాలి. చిరుని అందంగా, పాత స్టైల్లో చూపించిన ఘనత తప్పకుండా వినాయక్కే దక్కుతుంది. తాను చేసింది చిన్న చిన్న మార్పులైనా.. చిరు అభిమానుల్ని సంతోష పెట్టడమే ఎజెండాగా కష్టపడ్డాడు. కొన్ని సీన్లు… ముఖ్యంగా రైతులంతా ఆత్మహత్య చేసుకొనే సీన్‌ని మాతృకలోకంటే బాగా తీశాడు.
అన్నింటికంటే ముఖ్యంగా అనుకొన్న సమయానికి .. అంటే సంక్రాంతి పండక్కి సినిమా బయటకు వచ్చేలా సినిమాని సిద్ధం చేశాడు. ఇన్ని చేసినా.. వినాయక్ ప్రతిభేం లేన్నట్టు అతని పనితనాన్ని విస్మరిస్తున్నారు. అదే ఖైదీ ఫ్లాప్ అయితే.. అందరి వేళ్లూ వినాయక్ వైపు చూసేవి. చిరు 150వ సినిమాకి దర్శకత్వం వహించడం ఎంత అదృష్టమో… అంత కష్టం. అంచనాల భారం మోయడం ఆషామాషీ వ్యవహారం కాదు. దాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు వినాయక్. ఆయన కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోయినా చరణ్, చిరులు మాత్రం తప్పకుండా గుర్తించారు. అందుకే వీరిద్దరూ ”వినాయక్ తన సొంత సినిమాలా భావించి తీశాడు ” అంటూ పదే పదే చెబుతున్నారు. వినాయక్‌కి ఆ మాటలే కొండంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. శభాష్ వినాయక్.. మరోసారి చిరు అభిమానుల మనసుల్ని కొల్లగొట్టే సినిమా తీశావ్…!!