అందరూ బోలెడు మాటలు చెప్పారు. కేంద్రానికి, జల కేటాయింపుల సంఘానికి ఫిర్యాదులు చేశాం అన్నారు. లేఖలు రాశాం అన్నారు. న్యాయపరంగా పోరాటం సాగిస్తాం అని సెలవిచ్చారు. ప్రాజెక్టుల వద్ద ఉద్యమాలు చేశారు. కానీ వాస్తవం విషయానికి వస్తే ఎవ్వరూ సాధించింది ఏమీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాలకులు గానీ, ఇతర రాజకీయ పక్షాల వారు గానీ ఏమీ చేయలేకపోయారన్నది తేలిపోయింది. ఇవాళ ఎత్తిపోతల పనులకు సంబంధించి.. పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. హరీష్‌రావు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు నార్లపూర్, ఏదుల వద్ద ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణానీటి లభ్యత పరంగా ఎంతో కొంత అన్యాయం జరుగుతుందనడంలో సందేహం లేదు. దీని ప్రభావం రాయలసీమ మీదనే అధికంగా ఉంటుందనడంలో కూడా సందేహం లేదు. సీమ ప్రయోజనాలకు భారీగా గండి పడుతుంది.
చంద్రబాబునాయుడు సర్కారు, కేసీఆర్ సర్కారుతో కుమ్మక్కు అయిందని, పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడం గురించి ప్రయత్నించడం లేదని ఆరోపణలు చేయడం వరకే వైకాపా పరిమితం అయింది. అంతకు మించి తమ శ్రద్ధతో ప్రాజెక్టును అడ్డుకోవడం గురించి వారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేయడంతో పాటూ శ్రీశైలం వద్ద ఓ ధర్నాను కూడా నిర్వహించింది. తెలంగాణ కాంగ్రెస్‌తో కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధిస్తాం అన్నది గానీ.. అది వారికి చేత కాలేదు.
చంద్రబాబు సర్కారు విషయానికి వస్తే.. కేంద్రానికి లేఖ రాశాం.. న్యాయపోరాటం చేస్తాం అంటున్నారే గానీ.. ఏం సాధించారో తెలియదు. ఇవ్వాళ మాత్రం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం జరుగుతున్నది. మరి ఆంధ్ర పాలకులు, ఆ పార్టీలు అన్నీ కలిసి కూడా ఈ పనులకు కనీసం బ్రేకులు వేయలేకపోయాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.