ప్రభుత్వం మారగానే వైకాపా మొదటి టార్గెట్ టీడీజీ నేత కోడెల శివప్రసాద రావు అన్నట్టుగా కనిపించింది! ఎన్నికల రోజు నుంచే ఆయనపై కేసులు నమోదు కావడం, ఫలితాలు వచ్చాక ఆయనతోపాటు కుటుంబ సభ్యులపై కేసులు, కొన్నింట్లో ఎఫ్.ఐ.ఆర్.ల వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో, కోడెల ఒకింత ఇరకాటంలో పడ్డారని అనుకోవచ్చు. ముఖ్యంగా, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ, పెద్ద ఎత్తున అక్రమ సంపాదనలకు పాల్పడ్డారనీ, కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల్ని కోడెల ఫ్యామిలీ ఎదుర్కొంటోంది. అయితే, ఇవన్నీ వైకాపా రాజకీయ కక్ష సాధింపు చర్యలని కోడెల విమర్శించి, ఎదురుదాడికి దిగుతున్నారు. కానీ, కొంతమంది బాధితులు కోడెల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పక్కా ఆధారాలతో రోడ్ల మీదికి రావడంతో… ఆయన ఇరకాటంలో పడ్డారు.
ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అనూహ్యంగా మద్దతు అంటూ ఏదీ రాని పరిస్థితే ఉందని చెప్పాలి. దీంతో, ఈ కేసుల ఇరకాటం నుంచి బయటపడటం కోసం రాజీ ప్రయత్నాలు కోడెల ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో ఇవేవీ వర్కౌట్ కాకపోవడంతో, కుటుంబ సభ్యులతో కలసి ఈ మధ్యనే ఆయన ఢిల్లీ వెళ్లారనీ, కేంద్రంతో అత్యంత సన్నిహితుడుగా ఉంటున్న ఓ పెద్ద మనిషిని ఆయన కలిశారని సమాచారం. కోడెలతో మంచి సంబంధాలున్న ఆ పెద్దాయన కూడా… ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇన్వాల్వ్ కావడం బాగోదనీ సున్నితంగా తోసిపుచ్చారట. దీంతో, తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటూ, భాజపాలో మంచి గౌరవం ఉన్న ఓ ప్రముఖ నాయకుడి దగ్గరకి కూడా కోడెల వెళ్లారని సమాచారం. ఓ కాంట్రాక్టరు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా ఢిల్లీ నుంచి ప్రముఖులతో మౌఖిక ఆదేశాలు ఇప్పించుకోవాలనేది కోడెల ప్రయత్నంగా తెలుస్తోంది. అయితే, ఆ పెద్దాయన తన సర్కిల్ ద్వారా ఆ కాంట్రాక్టరుతో మాట్లాడినా… వెనక్కి తగ్గలేదట. దీంతో ప్రయత్నం కూడా పెద్దగా వర్కౌట్ అవుతున్నట్టుగా లేదనీ, ఆ పెద్దాయన కూడా కొన్నాళ్లు ఓపిక పట్టు, చూద్దామనే సలహా చెప్పారని తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు కోడెల ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి, తన కుటుంబంపై నమోదైన కేసులు, ఆరోపణల్ని… రాజకీయ కక్ష సాధింపులుగానే ప్రొజెక్టు చేస్తూ విమర్శలు చేస్తూ ఇమేజ్ మేనేజ్ చేయాలని కోడెల చూస్తున్నారట. ఎలాగూ కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు దిగుతున్న పరిస్థితి ఉంది. వాటిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి, ఇప్పుడు తనపై కేసుల్ని కూడా అదే గాటన కట్టేసి, విమర్శల చేస్తే కొన్నాళ్లు ఉపశమనం ఉంటుందని కోడెల భావిస్తున్నట్టుగా ఉన్నారు.