కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. రోజూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. గ్లోబరీనాకు లింక్ పెట్టి… తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. ఆ విమర్శలను కేటీఆర్ మాత్రమే తిప్పికొడుతున్నారు తప్ప.. ఒక్క మంత్రి అయినా మీడియా ముందుకు వచ్చి… కేటీఆర్‌కు మద్దతుగా మాట్లాడటం లేదు. ఇప్పటి వరకూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి.. రేవంత్‌కు సవాల్ విసిరారు. మిగతా మంత్రులు, నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారనేది… ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి.. ఇప్పుడు టీఆర్ఎస్లో కేటీఆరే సుప్రీం. ఎంత పెద్ద ఇష్యూ అయినా కేటీఆర్ డీల్ చేస్తారు. చివరిగా… కేసీఆర్ వద్దకు వెళ్తారు. అందుకే.. ఇప్పటి వరకూ.. కేటీఆర్‌పై ఈగ వాలినా నేతలు సహించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తేడా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నేతలు కేటీఆర్ పై ఏ ఒక్క విమర్శ చేసినా…..విరుచుకుపడే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటర్ పరీక్షల వ్యవహారంలో మాత్రం సైలెంట్ అయ్యారు. 20 మందికిపైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది సున్నితమైన అంశం కావడంతో మంత్రులు ఏం మాట్లాడితే ఏమౌవతుందోనన్న భయంతో సైలెంట్ అయినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఇష్యూపై మాట్లాడలేకపోయామని ఎమ్మెల్యేలు తమ అనుచరులతో చెప్పుకుంటున్నారట. ఇంటర్ ఫలితాల వ్యవహరంలో ఇప్పటికే ప్రభుత్వం బద్నాం అయిందని భావిస్తోన్న పార్టీ నేతలు….ఇప్పుడు ఆ విషయంలో తాము ఏం మాట్లాడినా నష్టం జరుగుతోందని భావిస్తున్నారట. అందుకే కేటీఆర్ పై ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉండాల్సి వచ్చిందని తమ వెర్షన్ వినిపించుకుంటున్నారు.
కానీ కేటీఆర్ మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో.. సీనియర్ నేతలు తనకు అండగా ఉండటం లేదనే భావనలో ఉన్నారని.. టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే స్పందించాల్సిన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లు మౌనంగా ఉండటాన్ని కేటీఆర్ తేలిగ్గా తీసుకోవడం లేదంటున్నారు. ఈ విషయంలో… కేటీఆర్‌కు.. సీనియర్ నేతలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందని.. టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.