జేబులో లక్ష రూపాయలు పెట్టుకుని తిరుగుతారు. కనపడిన వాళ్లందరికీ ఇస్తానంటారు. కానీ.. ఎవరికీ ఇవ్వరు. ఇది ఓ సినిమాలో సునీల్ క్యారెక్టర్. ఏపీ సర్కార్ తీరు కూడా అంతే ఉంది. డ్రైవర్లకు సాయం చేయడానికి రూ. 400 కోట్లు బడ్జెట్లో కేటాయించామని కానీ తీసుకునేవాళ్లే లేరని వాదిస్తోంది. వైసీపీ నవరత్నాల హామీల అమల్లో భాగంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే డ్రైవర్లకు ప్రతిఏడాది 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఇందు కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఈ పథకం అమలుకు మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తూ జీవో కూడా విడుదల చేశారు.
ఈ మార్గదర్శక సూత్రాలతో.. ఆరేడు లక్షల మంది ఉంటారనుకున్న లబ్దిదారులు… లక్షన్నరకు పడిపోయారు. అనేకానేక నిబంధలు పెట్టి అందర్నీ అనర్హుల్ని చేసేశారు. పథకం కోసం బడ్జెట్ లో రూ. 400 కోట్లు కేటాయించారు. ఆన్ లైన్ లోనూ, ఆప్ లైన్లో లక్షా 75 వేల 352 దరఖాస్తులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం కోసం అందాయి. ఇందులో లక్షా 73 వేల 102 దరఖాస్తులను మంజూరు చేశారు. డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తానని ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో జగన్ తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇవ్వగా, అనేకమంది డ్రైవర్లు తమకు ఆర్థిక సాయం అందుతుందని ఆశించారు. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, మ్యాక్సీ క్యాబ్ లు, అద్దెకు తీసుకుని తిప్పుకునే డ్రైవర్లు ఎక్కువమందే ఉన్నారు.
డ్రైవర్లుగా ఉండే అందరికీ ఆర్థిక సాయం అందిస్తే దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది డ్రైవర్లు లబ్ధిదారులుగా ఉండేవారని చెబుతున్నారు. అయితే ప్రభుత్వానికి భారం అవుతుందన్న ఉద్దేశంతో అందర్నీ.. అనర్హుల్ని చేసి.. పథకం అమలు చేశామని చెప్పుకోవడానికి కొంత మందికి ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్లో కేటాయించినత వరకైనా.. డ్రైవర్లకు ఇచ్చేలా నిబంధనలు ఎందుకు సడలించరని ప్రశ్నిస్తున్నారు.