తెలంగాణలో టిఆర్ఎస్ స్థానంలో మరో పార్టీ రావడం ఇప్పట్లో సాద్యమయ్యేది కాదని ప్రకటించారో ప్రజా ప్రతినిధి. దానికి కారణం కూడా చెప్పారు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి ముఖ్యమంత్రికి దగ్గరగా మెలుగుతున్న వ్యక్తి. ఆయన వాదన ప్రకారం ఈరోజుల్లో రాజకీయాల్లో ప్రభావం చూపించాలంటే కోట్లలో ఖర్చు పెట్టాలి. అంత వున్న వాళ్లే తక్కువ. వారిలో ముందుకొచ్చి ఇతర పార్టీలపై ఖర్చు చేయడం కల్ల అని వివరించారు. కాంగ్రెస్లో బాగా పేరున్న నాయకుణ్ని తాను గతంలో ఇలాటి ప్రతిపాదనతో కలిస్తే అది జరిగేపని కాదని కొట్టిపారేశారని కూడా గుర్తు చేశారు. నాయకుడు సైన్యం డబ్బు మూడు కలిస్తేనే రాజకీయ ప్రభావం. అంటే ఎన్నికల పోరాటం. టిఆర్ఎస్ వెనక అలా ఒకరిద్దరు నిలబడి డబ్బుకు లోటు లేకుండా సరఫరా చేశారుగనకే నిలబడింది. ఇప్పుడు అందరూ దాంట్లోనే చేరారు. తెలుగుదేశం వూసు లేదు. కాస్తో కూస్తో అవకాశం వున్న కాంగ్రెస్లో జిల్లాకొక నాయకుడు. ఎవరూ పైసా తీయరు. కులాల సమీకరణం కుదరదు. కమ్యూనిస్టులు దరిదాపుల్లో లేరు. బిజెపికి ఇక్కడ పునాది లేదు. కాబట్టి తెలంగాణ చాలా కాలం పాటు గులాబీ దళం చేతుల్లోనే వుంటుంది అని ఆయన అంచనా. వినడానికి బాగానే వుండొచ్చుగాని చరిత్రలో ఎన్ని మార్పులు జరగలేదు? ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప అని ఆయన కూడా ఒకింత అవకాశం అట్టిపెట్టుకున్నారు.