మూడేళ్ల తరవాత… పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా `వకీల్ సాబ్`. బాక్సాఫీసు దగ్గర వకీల్ సాబ్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నది అభిమానుల నమ్మకం. అయితే ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ… వకీల్ సాబ్ ఓటీటీలో ప్రసారం కానుందని, ఈనెల 23న ఓటీటీలో ఈసినిమా చూడొచ్చని ప్రచారం జరుగుతోంది. అంటే.. సినిమా విడుదలైన 15 రోజులకే ఓటీటీకి వచ్చేస్తుందన్నమాట. దాంతో.. ఇప్పుడిప్పుడే వకీల్ సాబ్ థియేటర్ల ముందు క్యూ కడుతున్న కుటుంబ ప్రేక్షకులు డ్రాప్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఓటీటీలో ఎలాగూ ఈ సినిమా చూస్తాం కదా, అని వాళ్లంతా లైట్ తీసుకోవొచ్చు.
ఈ ముప్పుని గ్రహించింది చిత్రబృందం. అందుకే `వకీల్ సాబ్.. ఓటీటీలో రావడానికి ఇంకా టైమ్ ఉంది` అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతోందన్న రూమర్లు నమ్మొద్దని, ఈ సినిమాని థియేటర్లలోనే చూడమని కోరింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో వస్తుందన్న వార్తల్లో నిజం లేదు… అని క్లారిటీ ఇచ్చింది. వకీల్ సాబ్ ని అమేజాన్ దాదాపు 30 కోట్లకు కొనుగోలు చేసింది. పెద్ద సినిమా ఏదైనా సరే, విడుదలైన 4 వారాల వరకూ.. ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయొద్దన్నది కొత్త నిబంధన. ఆ లెక్కన చూసినా… వకీల్ సాబ్ ఓటీటీకి రావడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది.