తెలుగు సినిమా అభిమానులు సంగీత దర్శకుడు, మేస్ట్రో ఇళయరాజాకు వచ్చిన ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో హ్యాపీగా ఫీలవ్వాలంతే. 2018 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఒక్కరంటే ఒక్క తెలుగు సినీ ప్రముఖుడి / ప్రముఖురాలి పేరూ లేదు. ఎప్పట్నుంచో పద్మ పురస్కారాల్లో తెలుగు సినిమా ప్రముఖులకు అన్యాయం జరుగుతోందనే నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మరోసారి తెలుగు సినిమాకు మొండిచెయ్యి మాత్రమే మిగిలింది. ఇళయరాజాకు పురస్కారం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, తెలుగు సినిమా ప్రముఖుల సంగతేంటి?
రెండేళ్ల క్రితం (2016 జూన్ లో) సీనియర్ నటులు జమున, కైకాల సత్యనారాయణలకు మా 9మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) చేసిన సన్మాన కార్యక్రమంలో పద్మ పురస్కారాలపై స్వర్గీయ దాసరి నారాయణరావు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ప్రతిభకు కాకుండా పైరవీలకు పురస్కారాలకు దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణల వరకూ… అంతకు ముందు ఎస్వీ రంగారావు, రాజబాబు ఇలా ఎంతో మందితో సినిమాలు చేసి, ఆణిముత్యాలు అనదగ్గ ఎన్నో సినిమాలు చేసిన దాసరికి పద్మ పురస్కారం లేదు. ఆయన ఏ వేదిక మీద నుంచి ఆరోపణలు చేశారో… ఆ వేదిక మీదున్న జమున, కైకాల సత్యనారాయణలకు ఇప్పటికీ పద్మ పురస్కారాలు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పద్మ పురస్కారాలు అందుకోని తెలుగు సినిమా ప్రముఖులు ఎందరో? వాళ్లందరికీ ప్రేక్షకుల అభిమానమే అత్యున్నత పురస్కారమ్… వాళ్లకి సలామ్.