పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలు ప్రభుత్వానివి.. కార్యాలయాలకు పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున రంగులు తొలగించాలనిఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని …కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వ భవనానికి వైసీపీ పార్టీ రంగులు వేయడం ప్రారంభించారు. ఫలానా రంగులు వేయాలని అధికారులు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు.
ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా… ఉన్నతాధికారుల ఆదేశం మేరకు.. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయాలకు.. పార్టీ రంగులు వేశారు. అప్పుడే… ఎన్నికల కోడ్ ప్రకారం.. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే… రంగులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే.. ప్రభుత్వం మాత్రం.. అలాంటిదేమీ పట్టించుకోలేదు. రంగుల వేయడం అనే ప్రక్రియను కొనసాగించింది. ఈ రంగుల కోసం… దాదాపుగా పదహారు వందల కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అధికారిక లెక్కలను మాత్రం ప్రభుత్వం ఇంత వరకూ బయటపెట్టలేదు.
కొద్ది రోజుల క్రితం.. గుంటూరు జిల్లా పల్లపాడులోని ఓ స్కూల్కు రంగులు వేయడంపై.. ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడే హైకోర్టు తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు.. అలాంటి తీర్పు.. రాష్ట్రం మొత్తానికి వర్తింప చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు.. పంచాయతీ భవనాలన్నింటికీ తెలుపు రంగు కోసం బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.