బీజేపీ దేశంలో మత రాజకీయాలు చేస్తోందని.. విద్వేషాలు పెంచుతోందని… దేశాన్ని విభజిస్తోందని ఆరోపిస్తూ 13 పార్టీలు ఒక్కటై సంయుక్తంగా ప్రజలకు ఓ పిలుపునిచ్చాయి. ప్రజలందరూ బీజేపీ విధానాల్ని తిప్పి కొట్టాలని దేశాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాయి. ఈ ప్రకటనపై అనేక విపక్ష పార్టీలు సంతకం చేసేందుకు నిరాకరించాయి. వాటిలో ఎన్సీపీ, శివసేన కూడా ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి కాంగ్రెస్ మహారాష్ట్రలో సంకీర్ణాన్ని నడుపుతోంది. ఇక కాంగ్రెస్కు దూరంగా ఉన్న పార్టీలు ఎస్పీ వంటి పార్టీలు కూడా ప్రకటనకు దూరంగానే ఉన్నాయి.
బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కేసీఆర్.. ఇంకా చెప్పాలంటే బీజేపీ మత రాజకీయాల్ని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రకటనకు దూరంగా ఉంది. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా అనేక వేదికల మీద తన వైఖరిని వెల్లడిస్తున్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా, మతతత్వ విధానాలను ఎక్స్ పోజ్ చేసే సంయుక్త ప్రకటనకు కేసీఆర్ను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ మిత్రపక్షంగా కాకపోయినా మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతున్నదని కేసీఆర్ విమర్శిస్తున్నందున ఆ ప్రకటనకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయం ఉంది.
ఇక వైసీపీ , టీడీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి స్టెప్ వేయడానికి సిద్ధంగా లేవు. ఏపీలో బీజేపీ ఉనికి లేదు కాబట్టి తాము స్పందించి.. అనవసరంగా బీజేపీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీల భావన. కానీ కేసీఆర్కు మాత్రం బీజేపీ ప్రమాదకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన… బీజేపీ వ్యతిరేక వాయిస్ వినిపించడంలో ఇతరులతో కలవడానికి సిద్ధపడకపోవడం … ఢిల్లీ రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.