అయ్యవారు అనుకున్నదే తడువుగా అంతర్జాతీయ విమానాలెక్కేసి ఆకాశయానం చేస్తుంటే, అమ్మగారేమో ఆకాశంలోవెళ్లే విమానాలను నేలపైనుంచి చూస్తూ టాటాలూ,బైబైలూ చెబ్తూ సంతోషపడాల్సి వస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచదేశాలను చుట్టుముడుతుంటే, మోదీ సతీమణి జశోదాబెన్ మోదీకి మాత్రం విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్ట్ పరంగా ఇబ్బంది తప్పడంలేదు. వీరిద్దరి మధ్య వివాహమైన తర్వాత విడివిడిగానే ఉంటున్నారు. భార్య తన దగ్గరలేకపోయినప్పటికీ, 2014 ఎన్నికలప్పుడు నామినేషన్ పత్రాల్లో స్పౌజ్ పేరు దగ్గర జశోదాబెన్ మోదీ అనే రాశారు. ఎవరిజీవితం వాళ్లదన్నట్టుగా వీరిద్దరూ చాలాకాలంగా జీవిస్తున్నారు. ఒకరేమో దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి. మరొకరేమో కనీసం పాస్ పోర్ట్ కూడా దక్కించుకోలేని వనిత.
జశోదాబెన్ మోదీకి సన్నిహితులైన బంధువులు చాలామంది విదేశాల్లో ఉన్నారు. వారిని కలుసుకోవాలనుకున్నది ఆమె కోరిక. అందుకే ఈమధ్యనే పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే, గుజరాత్ లోని పాస్ పోర్ట్ రీజనల్ ఆఫీసువాళ్లు ఈమె దరఖాస్తుని తిరస్కరించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేదా దంపతులిద్దరు కలిసి సిద్ధంచేసిన అఫిడవిట్ గానీ సమర్పించనందున దరఖాస్తు తిరస్కరించినట్లు పాస్ పోర్ట్ అధికారి జెడ్ఎ ఖాన్ చెబుతున్నారు.
జశోదాబెన్ చాలాకాలంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారనీ, అయితే, ఈమధ్యనే ప్రయత్నాలు మొదలుపెడితే, అడ్డుకులు ఎదురవుతున్నాయని ఆమె సోదరుడు అశోక్ మోదీ అంటున్నారు. పాస్ పోర్ట్ పొందడం దేశంలోని పౌరులందరికీ ఉన్న హక్కేగనుక ఆమె న్యాయపరమైన ప్రత్యామ్నాయాన్ని అనుసరిస్తారని చెప్పారు.
అంతకుముందు జశోదాబెన్ తనకు కేటాయించిన భద్రతపై పూర్తి వివరాలు కావాలని సమాచారహక్కు చట్టం ద్వారా కోరారు.
అయితే, ఇది భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి తాము ఆర్ టిఏ క్రింద సమాచారం ఇవ్వలేమని మెహ్సానా పోలీస్ సూపరిండెంటెంట్ వివరణ ఇచ్చారు. 2014 ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ తన నామినేష్ దరఖాస్తులో జశోదాబెన్ పేరును భార్యపేరుగా పేర్కొనడం, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధానిగా ఎదగడంతో జశోదాబెన్ కు అధికారిక భద్రత కల్పించారు.
మోదీ భార్య స్కూల్ టీచర్ గా రిటైరయ్యాక, ఉత్తర గుజరాత్ లోని ఒక గ్రామంలో తన సోదరుడైన అశోక్ మోదీ ఇంట్లో ఉంటున్నారు.
ప్రధాని మోదీతో పాటుగా ఆమె సతీమణిగా విదేశాల్లో తిరగకపోయినా, కనీసం పాస్ పోర్ట్ సంపాదించుకుని విదేశాల్లో ఉన్న తనవాళ్లను చూడాలన్న ఆమె కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.