నవ్యాంధ్ర రథసారధిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి త్వరలో మూడేళ్లు నిండుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఏం సాధించారంటే.. అత్యంత వేగంగా తాత్కాలిక సచివాలయం నిర్మించాం అని చెబుతారు. వెలగపూడి సచివాలయాన్ని జట్ స్పీడులో కట్టామని అంటారు. తాత్కాలిక అసెంబ్లీని రికార్డు స్థాయిలో కేవలం 192 రోజుల్లో నిర్మించి చూపించాం అంటారు. ఇవన్నీ ఓకే… కానీ, ముఖ్యమంత్రికి సొంత రాష్ట్రంలో సొంత ఇల్లు ఏదీ..? ఏపీలో సొంత ఇంటి నిర్మాణం గురించి చంద్రబాబు ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదు..? అన్నీ సూపర్ పాస్ట్ గా చేస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు, ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు..?
ఈ చర్చ ఇప్పుడు తెలుగుదేశం వర్గాల నుంచే వినిస్తుండటం విశేషం! ఏపీలో జగన్ కు ఇల్లు కూడా లేదని టీడీపీ నేతలే విమర్శిస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే కదా. అయితే, ఆ మధ్య ఇంటి స్థలం కోసం చూస్తున్నట్టు ప్రకటనలు చేశారండోయ్. కాకపోతే, ఆ తరువాత జరిగిన ప్రయత్నాల గురించి ఎక్కడా ఎలాంటి వార్తలూ రాలేదు. ఇంకోపక్క.. కరెక్ట్ గా ఒక్క ఏడాదిలో హైదరాబాద్ లో ఇల్లు కట్టేసుకున్నారు. అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో ఆయన ఇల్లు కట్టుకోవడం తప్పు అని ఎవ్వరూ అనరు. కానీ, సొంత రాష్ట్రమైన ఆంధ్రాలో ముఖ్యమంత్రికి ఏదో ఒక నివాసం ఉండాలి కదా. తమ ముఖ్యమంత్రికి ఆంధ్రాలో ఇల్లు లేదే అని ప్రజలు అనుకుంటారు కదా!
ఇప్పుడు కూడా.. సొంత ఇంటి ప్రయత్నాలకు సంబంధించి ఎలాంటి కదిలికా లేదని టీడీపీ వర్గాలే అంటున్నాయి. అప్పట్లో ప్రయత్నించారుగానీ, ఆ తరువాత దాన్ని చంద్రబాబే పట్టించుకోవడం మానేశారట! నిజానికి, విజయవాడలో సీఎం ఉంటున్న నివాసం అక్రమ కట్టడం అని అప్పట్లో ప్రభుత్వమే చెప్పింది. తరువాత, దాన్ని సక్రమంగా మార్చేశారనుకోండీ! అయినాసరే, మిగతా విషయాలో అత్యంత చొరవ తీసుకునే చంద్రబాబు… సొంత ఇంటి విషయమై ఎందుకింత తాత్సారం చేస్తున్నారనే ప్రశ్న ఉంటుంది కదా! అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి నిర్మాణాలను అత్యంత వేగంగా చేపట్టిన చంద్రబాబు.. ఇక్కడ సొంత ఇల్లు వద్దని అనుకుంటున్నారా..? లేదంటే, దానికి కూడా అమరావతికి వేస్తున్నట్టుగా అంతర్జాతీయ సంస్థలతో డిజైన్లు వేయిస్తున్నారేమో..?
విపక్ష నేతకు కూడా ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు. ఆయన కూడా ఆ దిశగా ప్రయత్నించిందీ లేదు. స్థలం చూశామనీ.. నిర్మాణం జరుగుతోందని మాత్రమే అప్పట్లో ప్రకటించారు. ఆ తరువాత, వారూ దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబుగానీ, జగన్ కిగానీ హైదరాబాద్ లో ఇళ్లుండటం తప్పులేదు. కానీ, సొంత రాష్ట్రం అనేది ఆంధ్రా కదా! అక్కడ పర్మనెంట్ అడ్రెస్ ఉండాలి కదా.