మెగాస్టార్ చిరంజీవి ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో… జరగాల్సిన ఎస్వీరంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. హఠాత్తుగా కార్యక్రమం వాయిదా పడింది. విగ్రహం రెడీ అయింది. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చిరంజీవి కూడా.. తన టూర్‌ని ప్లాన్ చేసుకున్నారు. అనూహ్యంగా.. ఒక్క రోజు ముందుగా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా… నిర్వాహకులు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని.. అందుకే వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. తాడేపల్లి గూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.యన్.రోడ్లో భారీ ఖర్చుతో ఎస్వీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
చిరంజీవి చాలా రోజుల తర్వాత.. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. అభిమానులంతా.. పెద్ద ఎత్తున స్వాగతం పలికి.. ఓ రకంగా బలప్రదర్శన తరహాలో… హంగామా చేద్దామనుకున్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేసుకున్నారు. పైగా.. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కూడా.. విడుదలకు రెడీ ్వుతోంది. ఈ సమయంలో.. మరింతగా హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. అయితే.. ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. విగ్రహాన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేశారా..? లేక.. చిరంజీవి వస్తే.. భారీ సందోహం వల్ల బందోబస్తు కల్పించడం ఇబ్బంది అవుతుందని పోలీసులు చెప్పారా.. అన్నదానిపై క్లారిటీ లేదు. దీనిపై నిర్వాహకులు కూడా.. సైలెంట్ గా ఉంటున్నారు.
మామూలుగా చిరంజీవి ఏపీ పర్యటనకు వస్తే.. భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. వారి ఎప్పుడు అనుమతి ఇస్తే.. అప్పుడు మాత్రమే.. ఏపీకి వెళ్లాల్సిన అవసరం చిరంజీవికి లేదు. కానీ.. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు మాత్రం.. ఇంకేదో కారణంతో పోలీసులు అనుమతులు మంజూరు చేయలేదమోనన్న భావన మెగా అభిమానుల్లో ఏర్పడుతోంది.