జగన్ పాదయాత్ర కి అంతా సిద్దమయింది. మరో నాలుగు రోజుల్లో వైసిపి పాదయాత్ర “మహా సంకల్ప యాత్ర ” పేరు తో మొదలవబోతోంది. 125 నియోజక వర్గాల్లో పాదయాత్ర , మిగిలిన నియోజక వర్గాల్లో బస్సు యాత్ర చేయడానికి వైసిపి సిద్దమవుతోంది. జగన్ పూర్తి సన్నద్దమయ్యాక, పోలీస్ అధికారులు మాత్రం పాదయాత్ర కి పర్మిషన్ లేదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
అలాగే ముద్రగడ పాదయాత్ర కి కూడా పర్మిషన్ లేనందునే ఆయన పాదయాత్రకి ఆటంకం కలిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక వైసిపి వర్గాలు మాత్రం దీనిమీద దృష్టి సారించామని, గతం లో పాదయాత్ర చేసినవాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారో చూస్తామని కూడా ఇన్ డైరెక్ట్ హెచ్చరికలు చేసారు. అంటే గతం లో చంద్రబాబు పాదయాత్ర అప్పుడు, వైఎస్ పాదయాత్ర అప్పుడు ఇలాంటి పర్మిషన్స్ గొడవ పెద్దగా లేదని తెలిసిందే. అదే విషయాన్ని వారు పరోక్షంగా గుర్తు చేస్తున్నారన్నమాట. అలాగే ఒక వేళ పర్మిషన్సే అవసరమైతే ఎంతదాకా వెళ్ళైనా ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తెచ్చుకుంటామని ఆత్మ విశ్వాసం ప్రకటిస్తున్నారు.
ఇక మరో ప్రక్క శుక్రవారం కోర్ట్ కి హాజరవాల్సిందే అన్న తీర్పు తో ఆ బ్రేక్ ని జగన్ ఎలా “హ్యాండిల్ ” చేస్తాడనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది. ఇటు టిడిపి విమర్శల ధాటి కూడా పెంచింది. మొత్తానికి నాలుగు రోజుల తర్వాత నుంచి ఈ విమర్శ ప్రతి విమర్శల హోరు పెరిగి ఈ శీతకాలాన్ని వేడెక్కించనున్నాయి.