అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అయితే మీడియాకు మాత్రం అందరికీ పర్మిషన్ దొరకడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని టీవీ చానళ్లను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానిచ్చేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం సిద్దంగా లేరు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ అనుకూల మీడియాగా పేరున్న వాటికి మాత్రం కేవరేజీకి చాన్సిస్తున్నారు. అసెంబ్లీ లైవ్‌ను కూడా.. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానళ్లు ఇవ్వకుండా… నిషేధం విధించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగా… ఒక్క నిమిషం పాటు.. మీడియా పాయింట్లో ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న దాన్ని ప్రసారం చేశారు.
అది నిబంధనలకు విరుద్ధమని.. చెబుతూ అప్పటి నుండి… ఆ చానళ్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ చానళ్ల ప్రతినిధుల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వడం లేదు. మీడియా సంఘాలు ఓ ప్రకటన చేసి సైలెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు కూడా స్పీకర్ అనుమతి ఇవ్వడం లేదు. నిజానికి సెషన్లో తీసుకున్న నిర్ణయాలు ఆ సెషన్ వరకే పరిమితం చేస్తారు. మీడియా విషయంలో… వివరణ తీసుకుని .. వదలిస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఓ చిన్న తప్పును పట్టుకుని.. మీడియాను అనుమతించకపోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని చానళ్లను నియంత్రించి.. తమకు మద్దతుగా ఉండే వారి మీడియాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.
అయితే.. తాము చెప్పిందే వేదమన్నట్లుగా ఉన్న పాలకులు.. మీడియాపై కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు.. శాసనండలి చైర్మన్‌కు కు లేఖ రాశారు. అన్ని మీడియా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. నిజానికి శాసనమండలి చైర్మన్ .. శాసనమండలి ప్రోసీడింగ్స్ అన్ని మీడియా సంస్థలకు ఇవ్వాలని ఆదేశించినా.. స్పీకర్ అధీనంలో ఉద్యోగులు పడనీయడం లేదు. దీంతో ఆయన ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. ఈ సారి మాత్రం మీడియా సంస్థల నుంచి.. తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.