తెలంగాణలో రెండ్రోజులు పర్యటించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీన్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. బహిరంగ సభలకు లోపల అనుమతి ఇవ్వరు కాబట్టి, విద్యార్థులతో భేటీ కావాలని నిర్ణయించారు. అయితే, రాహుల్ ని ఉస్మానియాలోకి రానిచ్చేదే లేదని కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. ఆయన్ని యూనివర్శిటీలో అడుగుపెట్టనియ్యకుండా చూడాలంటూ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డికి వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఇంకోపక్క, రాహుల్ భేటీ అనుమతి కోసం కాంగ్రెస్ కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
దీంతో రాహుల్ గాంధీ పర్యటనలో 14వ తేదీ షెడ్యూల్ ఇంకా ఒక కొలీక్కి రాలేదు. 13న ఆయన ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర్నుంచీ… ఆ రోజంతా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చేసింది. కానీ, 14న ఓయూలో పెట్టుకున్న మీటింగ్ పరిస్థితి ఏంటనే సందిగ్ధం ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ మీటింగ్ కి అనుమతి ఇవ్వాలంటూ అనుమతి కోరుతూ కొంతమంది విద్యార్థులు వీసీకి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ, ఇంతవరకూ దీనిపై స్పష్టత రాలేదు. దీంతో రాహుల్ సభ ఓయూలో ఉంటుందా లేదా అనేది తేలకపోవడంతో… 14వ తేదీ షెడ్యూల్ ఏంటనేది ఇంకా ఖరారు చెయ్యలేకపోతున్నారు.
అయితే, రాహుల్ కి ఓయూలో కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి ఇస్తే.. ఏవైనా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోవచ్చనే ఆందోళన కూడా కొంత ఉంది. దీంతో, రాహుల్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఓయూలో సమావేశాన్ని వద్దనే సూచిస్తున్నట్టు సమాచారం. యూనివర్శిటీలో ఇప్పటికే అనుకూల, ప్రతికూల విద్యార్థి వర్గాలు రోజూ నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో రద్దు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయమూ ఉందని తెలుస్తోంది. కానీ, రాష్ట్ర నేతలు ప్రయత్నం వేరేలా ఉంది. యూనివర్శిటీలో కాదంటే… దానికి దగ్గర్లో ఏదో ఒక ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ పర్యటనలో రెండో రోజు షెడ్యూల్ ఏంటనేది ఖరారు కాలేదు. దీంతోపాటు, ఇకపై నెలకోసారి రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే నెలలో ఆయన మరోసారి వస్తారనీ, భారీ ఎత్తున బహిరంగ సభ వచ్చే నెలలో ఉంటుందనీ అంటున్నారు.