RRR ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. RRR బృందం దేశమంతా చక్కర్లు కొడుతోంది. అయితే తెలుగులో మాత్రం ప్రచారానికి టైమ్ దొరకడం లేదు. నాలుగు రోజుల క్రితం తెలుగు మీడియాకి రాజమౌళి, చరణ్,ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇద్దామనుకున్నారు. కానీ… ఆ ఈవెంట్ చివరి నిమిషాల్లో క్యాన్సిల్ అయ్యింది. మరి… ఇక్కడ ప్రమోషన్లు ఎప్పుడు మొదలెడతారు? అసలు ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి ఆ ఉద్దేశ్యం ఉందా? లేదా?
ఆర్.ఆర్.ఆర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో రెండు చోట్ల ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించాలని ప్లాన్. ఒకటి హైదరాబాద్ లో. మరోటి తిరుపతిలో. హైదరాబాద్ లో ఈనెల 3 వరకూ ఎలాంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించకూడదన్నది ఓ నిబంధన. సో.. 3 వరకూ తెలంగాణలో పర్మిషన్లు రావు. ఆ తరవాత పర్మిషన్లు వచ్చినా, క్రౌడ్ గేదరింగ్ విషయంలో ప్రభుత్వం విధించే నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినా పరిమిత సంఖ్యలో మాత్రమే అభిమానులకు అనుమతి ఉంటుంది. ముందు హైదరాబాద్ లో ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ తరవాత తిరుపతికి వెళ్లాలి. రెండు ఈవెంట్లకు సమయం ఉంటుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
హైదరాబాద్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి ఎవరొస్తారు? అనే సందిగ్ధం నెలకొంది. చిరంజీవి, బాలకృష్ణలను అతిథులుగా పిలిచే అవకాశం ఉంది. చిరు అయితే గ్యారెంటీ. బాలయ్య వస్తాడా, రాడా? అనేది తేలాల్సివుంది. ఒక వేళ చిరు కూడా రాకపోతే… కేవలం ఈ రెండు వేడుకలు ఆర్.ఆర్.ఆర్ బృందానికి మాత్రమే పరిమితం కావొచ్చు. ముందు పర్మిషన్లు దొరికి, వేదిక సెట్టయితే… అప్పుడు అతిధుల గురించి ఆలోచించొచ్చన్నది ప్లాన్.